V6 News

వడ్లు అగ్వకే కొంటుండ్రు..క్వింటాల్కు రూ.1,700 మించట్లే..రంగంలోకి దళారులు, మిల్లర్లు

వడ్లు అగ్వకే కొంటుండ్రు..క్వింటాల్కు రూ.1,700 మించట్లే..రంగంలోకి దళారులు, మిల్లర్లు
  •  స్పాట్ పేమెంటా..? రెండు శాతం కటింగ్​
  •     కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోలు వెరీ స్లో..
  •     రంగంలోకి దళారులు, మిల్లర్లు

జనగామ, వెలుగు : వడ్ల కొనుగోళ్లు స్లోగా సాగుతున్నాయి. కొనుగోలు సెంటర్లు పూర్తిగా ఓపెన్ కాలేదు. ఓపెన్ అయిన సెంటర్లలో వడ్లు కొనుగోలు సరిగా జరగడం లేదు. నిర్దేశించుకున్న లక్ష్యంలో కేవలం రెండు శాతం వడ్లను కూడా ఇప్పటివరకూ కొనుగోలు చేయలేదు. దీనినే ఆసరాగా చేసుకున్న మిల్లర్లు అగ్వకే వడ్లను కొంటున్నరు. 

4,45,386 టన్నుల వడ్లు దిగుబడి అంచనా..

ఈ యాసంగి సీజన్​లో జనగామ జిల్లాలోని 12 మండలాల్లో దొడ్డు రకం 1,66,735 ఎకరాల్లో సాగు చేయగా, సన్న రకం 29,474 ఎకరాల్లో సాగు చేశారు. దొడ్డు రకం వడ్లు ఎకరానికి 23 క్వింటాళ్లు, సన్న రకం 21 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు. ఈ అంచనాల ప్రకారం 4,45,386 టన్నుల వడ్లు దిగుబడి రానుంది. దీనిలో బహిరంగ మార్కెట్లో మిల్లర్లు, దళారులు కొనుగోలు చేయగా, సెంటర్లకు వచ్చే 3 లక్షల టన్నులను తాము కొనుగోలు చేస్తామని సివిల్ సప్లయ్​ డిపార్ట్​మెంట్ అంచనాలు వేసుకుంది. ఏర్పాటు చేసిన సెంటర్లకు మిల్లులను ట్యాగింగ్​ చేశారు. 

రెండు శాతం కూడా కొనుగోలు చేయలే..

సివిల్​ సప్లయ్ డిపార్ట్​మెంట్​ సెంటర్లు ఓపెన్​ చేసినా కొనుగోళ్లు ఊపందుకోలేదు. డిపార్ట్​మెంట్ యాక్షన్ ప్లాన్ ప్రకారం మొత్త్తం 3 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయాల్సి ఉండగా, ఈ నెలాఖరుకు 2.29 లక్షల టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ కొనుగోలు సెంటర్లలో కేవలం 4500 టన్నులు మాత్రమే కొన్నారు. ఇందులో సగానికంటే ఎక్కువగా మిల్లులకు పంపించగా, అన్​లోడ్​ చేసుకున్నారు. అయితే సివిల్​ సప్లయ్ డిపార్ట్​మెంట్​ లెక్కల ప్రకారం మిల్లర్లు ఏప్రిల్​లో 50 వేల టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంటే.. అంతకు మించి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది.

క్వింటాల్​ రూ.1700..

సివిల్​ సప్లయ్ డిపార్ట్​మెంట్ కొనుగోళ్లు స్లోగా సాగుతుండడంతో దళారులు, మిల్లర్లు రంగంలోకి దిగారు. సాధారణ రకమైన వడ్లకు క్వింటాల్​కు రూ.2369, ఏ గ్రేడ్​కు రూ. 2389 చొప్పున చెల్లించాలని కేంద్రం మద్దతు ధర ప్రకటించింది. అయితే దళారులు, మిల్లర్లు రైతుల వద్దకు నేరుగా వెళ్లడం లేదా మార్కెట్​కు వడ్లకు తీసుకొచ్చిన రైతులను కలుస్తున్నారు. అయితే వడ్లు ఎట్లున్నా క్వింటాల్​కు రూ.1700 చెల్లించి తీసుకుంటామని చెబుతున్నారు. తేమ, తాలు శాతం కరెక్ట్​గా ఉంటే రూ.2100 చెల్లిస్తామని చెబుతున్నారు. నెట్ పేమెంట్ కావాలంటే రెండు శాతం తగ్గిస్తామని, 15 రోజులకు తీసుకుంటామంటే పూర్తి పేమెంట్​ చెల్లిస్తామని దళారులు చెబుతున్నారు. అయితే చెడగొట్టు వానలు వస్తాయేమోనన్న ఆందోళనతో మద్దతు ధర రాకున్నా దళారులకు వడ్లు అమ్మేసుకుంటున్నారు. అత్యవసరం ఉన్న రైతులు రెండు శాతం పేమెంట్​తక్కువైనా సరే అని డబ్బు తీసుకుంటున్నారు.