
- కొనుగోళ్లు ఆలస్యం కావడంతో సెంటర్ల వద్ద రైతుల పరేషాన్
- టార్గెట్ 1.89 లక్షల మెట్రిక్ టన్నులు, కొన్నది 10 వేల మెట్రిక్ టన్నులే
నాగర్ కర్నూల్, వెలుగు: నాగర్‌కర్నూల్ జిల్లాలో వడ్ల కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు ఆరబోసిన రైతులను వాన భయం వెంటాడుతుండగా, కాంటా అయిన వడ్లను మిల్లుల్లో దింపుకోకుండా మిల్లర్లు రోజుల తరబడి వేధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మూడు సీజన్లుగా వడ్లు తీసుకున్న మిల్లర్లు సీఎంఆర్ బకాయి పడడంతో ఈసీజన్లో డిఫాల్టర్లను పక్కకు పెట్టారు. జిల్లాలో 137 రైస్ మిల్లులు ఉంటే, 13 మిల్లులకు మాత్రమే ఈ సారి వడ్లు కేటాయించారు. జిల్లాలో ఈ సీజన్లో 1.89 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తాయనే అంచనాతో, 234 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 222 కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లు ప్రారంభించారు. వీటిలో ఇప్పటి వరకు 10 వేల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొనుగోలు చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో తప్పని తిప్పలు..
కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం, టార్పాలిన్ కవర్లు సమకూర్చకపోవడంతో ఆరబెట్టిన వడ్లు వర్షానికి తడుస్తున్నాయని రైతులు వాపో తున్నారు. ట్రాన్స్పోర్ట్ టెండర్ ఖరారు కాకపోవడంతో, కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వడ్లు తరలింపును పాతవారికే అప్పగించారు. వారు లారీలను ఏర్పాటు చేయకుండా రైతుల ట్రాక్టర్లలో తెచ్చిన వడ్లను మిల్లులకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వడ్లు సరిగా ఆరలేదని, బియ్యం తక్కువగా వస్తాయని చెబుతూ క్వింటాల్‌కు 4 నుంచి 6 కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ప్రైవేట్‌గా అమ్ముకుంటున్నారు..
నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఈ సీజన్లో వరి సాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం.. ఈసారి 1.89 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తాయని లెక్కలు వేశారు. దానికి తగ్గట్లుగా గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు, తేమ శాతం మెషీన్లు, తూర్పార పట్టే మెషీన్లు సమకూర్చుకున్నారు. కొనుగోలు సెంటర్లలో ఆలస్యం అవుతుందనే కారణంతో చాలా మంది రైతులు ప్రైవేట్‌లో అమ్ముకుంటున్నారు. వీరిని మిల్లర్లు దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వడ్లు ఆరలేదన్న సాకుతో మిల్లర్లు క్వింటాల్‌కు రూ.1700కు మించి ఇవ్వడం లేదని అంటున్నారు.
డిఫాల్టర్ల ఎఫెక్ట్..
జిల్లాలో 137 రైస్ మిల్లులు ఉన్నా, సీఎంఆర్ బకాయి కారణంగా 100 మిల్లులు డిఫాల్టర్ల లిస్ట్‌లోకి చేరాయి. 50 శాతం సీఎంఆర్ క్లియర్ చేసిన మిల్లులకు వడ్లు కేటాయించాలని నిర్ణయించారు. బ్యాంక్ గ్యారెంటీ, ఇతర కండీషన్లతో అర్హత ఉన్నప్పటికీ మిల్లర్లు వడ్లు తీసుకొనేందుకు ముందుకు రాలేదు. ఈ సీజన్లో కేవలం13 మిల్లలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. వీటిలో 6 పారా బాయిల్డ్ మిల్లులు,7 రా మిల్లులు ఇన్నాయి. రైతుల నుంచి ఒత్తిడి పెరిగితే జిల్లా అధికారులే తమను బతిమిలాడి వడ్లు ఇస్తారన్న ధీమాతో ఉన్న మిల్లర్లకు సివిల్ సప్లై అధికారులు షాక్ ఇచ్చారు.