వడ్లు కొంటలె.. కొన్నయి దింపుతలె

వడ్లు కొంటలె.. కొన్నయి దింపుతలె
  • పూర్తిస్థాయిలో తెరుచుకోని కొనుగోలు సెంటర్లు
  • హమాలీల కొరతతో లేటవుతున్న అన్ లోడిండ్ 
  • మిల్లుల వద్ద బారులు తీరుతున్న వాహనాలు
  • తేమ పేరుతో దోచుకుంటున్న మిల్లర్లు
  • ఆవేదనతో రోడ్డెక్కుతున్న అన్నదాతలు

వెలుగు, నెట్​వర్క్​:  రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ఊపందుకోవడంతో సెంటర్లకు వడ్లు పోటెత్తుతున్నాయి. నెలరోజులుగా ధాన్యం వస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో అన్నిచోట్లా వడ్లరాశులు పేరుకుపోతున్నాయి. మెదక్​, కామారెడ్డి లాంటి కొన్ని జిల్లాల్లో వడ్ల కొనుగోళ్లు రెండు, మూడు రోజులపాటు స్పీడ్​గా నడిచినప్పటికీ  హమాలీల కొరతతో మిల్లుల్లో అన్​లోడింగ్​లేటవుతోంది. దీంతో ఆయా మిల్లుల వద్ద ట్రాక్టర్లు, లారీలు కిలోమీటర్ల కొద్దీ బారులుతీరుతున్నాయి. అన్​లోడ్​ కాకపోవడంతో ఆయా జిల్లాల్లోనూ కాంటాలు బంద్​పెట్టారు. కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం పలుచోట్ల రైతులు ఆందోళన చేశారు. మరోవైపు వారాల తరబడి వడ్ల కుప్పల వద్ద ఉండలేక దళారులకు అగ్గువకు అమ్ముకుంటున్నారు. నేరుగా మిల్లులకు వడ్లు తీసుకెళ్తున్న రైతులను మిల్లర్లు తేమ పేరుతో దోచుకుంటున్నారు. 

తెరుచుకోని సెంటర్లు

రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో నెల కిందే వరి కోతలు ప్రారంభించిన రైతులు వడ్లను కొనుగోలు సెంటర్లకు తరలిస్తున్నారు. ఈ సీజన్​లో 6,713 సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన సర్కారు ఇప్పటివరకు మూడోవంతు కూడా తెరవలేదు. చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు సెంటర్లను ఓపెన్​చేస్తున్నా కాంటాలు పెట్టకపోవడంతో రైతులు వడ్ల కుప్పల వద్ద పడిగాపులు పడ్తున్నారు . కరీంనగర్ జిల్లాలో 351 సెంటర్లకు 243 సెంటర్స్ ఓపెన్ చేశారు . కానీ 28 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. మిగిలిన చోట్ల రైతులకు తిప్పలు తప్పడం లేదు. మంచిర్యాల జిల్లాలో  229 సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వారం, పది రోజులుగా సెంటర్లకు వడ్లు వస్తున్నా ఇప్పటివరకు ఒక్క సెంటర్​ను కూడా ఓపెన్​ చేయలేదు. నిర్మల్ జిల్లాలో 192 సెంటర్లకు ఏడు సెంటర్లలోనే కాంటాలు పెడ్తున్నారు.

మహబూబాబాద్ జిల్లాలో 240 సెంటర్లు తెరుస్తామని ఐదు సెంటర్లు మాత్రమే తెరిచారు. ఆసిఫాబాద్ జిల్లాలో 30 సెంటర్లకు ఒక్కటి కూడా ఓపెన్​ చేయలేదు. భూపాలపల్లి జిల్లాలో 185 కేంద్రాలకు 4 మాత్రమే తెరిచారు. వరంగల్ జిల్లాలో 157, నాగర్ కర్నూల్ జిల్లాలో 222, ఖమ్మం జిల్లాలో 230 , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 145 , ములుగు జిల్లాలో 170 సెంటర్లకు ఒక్కటి కూడా తెరవలేదు. కొనుగోళ్లు లేటవుతుండడంతో రోజుల తరబడి వడ్లకుప్పల వద్ద కాపలా ఉండలేని రైతులు దళారులకు అడ్డికి పావుశేరు అమ్ముకుంటున్నారు. నెలరోజులుగా సర్కారు కొనకపోవడంతో తన వడ్లను వ్యాపారులకు అమ్ముకున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం జగ్గయ్యపల్లికి చెందిన రైతు వెంకట్ రెడ్డి ‘వెలుగు’కు చెప్పారు.  క్వింటాల్​రూ.1500 చొప్పున 15 క్వింటాళ్లు అమ్ముకున్నానని వాపోయాడు. 

అన్​లోడ్​ అయితలే.. 

మిల్లుల్లో సరిపడా హమాలీలు లేకపోవడంతో సెంటర్ల నుంచి వెళ్లిన వడ్లు అన్​లోడ్​ కావడం లేదు. మెదక్​ జిల్లాలోని పలు రైసుమిల్లుల్లో ఒక్కో ట్రాక్టర్, లారీ​అన్​లోడ్​అయ్యేందుకు నాలుగు రోజుల దాకా పడుతోంది. దీంతో మిల్లుల వద్ద లారీలు, ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. సెంటర్లలో కాంటాలు ఆపేస్తున్నారు. ఈ క్రమంలో ధాన్యం కొనుగోళ్లు, అన్​లోడింగ్​లో జాప్యాన్ని నిరసిస్తూ మండల కేంద్రమైన కొల్చారం, రంగంపేట గ్రామాల్లో  రైతులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో  25 రోజుల నుంచి రైతులు వడ్ల కుప్పలు తెచ్చి పోస్తున్నారు. 300 సెంటర్లలో  కాంటా పెడ్తున్నా మిల్లుల్లో అన్​లోడ్​ కావడం లేదు. దీంతో  కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు లింగంపేట మండలం షేట్​పల్లి సంగారెడ్డి  వద్ద రోడ్డుపై మూడురోజుల కింద ధర్నా చేశారు.

కొనుగోళ్లలో జాప్యంపై రైతుల ఆందోళన

సెంటర్లలో కాంటా పెట్టి తీసుకెళ్తున్న వడ్లను తేమ పేరుతో మిల్లర్లు అడ్డుకుంటున్నారని, కటింగ్​కు ఒప్పుకుంటేనే దింపుకుంటున్నారని ఆరోపిస్తూ పలుచోట్ల రైతులు ఆందోళనలకు దిగారు. ఆఫీసర్లు, మిల్లర్ల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టిన ధాన్యాన్ని ట్రాక్టర్​ లో తీసుకెళ్తే ​మిల్లర్లు అన్​లోడ్​ చేసుకోవడం లేదని మెదక్​ జిల్లా కొల్చారం మండల పరిధిలోని రంగంపేటలో రైతులు మెదక్​–సంగారెడ్డి మెయిన్​ రోడ్డుపై రాస్తారోకో చేశారు. రైస్​మిల్ ​ఓనర్ ​సీరియల్​ ప్రకారం ధాన్యం అన్​లోడ్​ చేసుకోవడం లేదంటూ మెదక్-హైదరాబాద్ నేషనల్​ హైవే పై వరిగుంతం రైతులు బైఠాయించారు.  

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని రాఘవేంద్ర రైస్ మిల్ లో ప్రతి కింటాల్​కు 10 కిలోలు, ఒక్కో లోడ్ కు 10 క్వింటాళ్లు కోత పెట్టడంతో రైతులు నేరేడుచర్ల–మిర్యాలగూడ రోడ్డుపై ఆందోళన చేశారు.  వడ్లను వెంటనే కొనాలని, 41 కిలోల తూకం వేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలోని సిద్దిపేట -కామారెడ్డి మెయిన్​రోడ్డుపై మల్లారెడ్డిపేట రైతులు ధర్నా చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం ఐకేపీ సెంటర్​లో గోనె సంచులు లేవని, హమాలీ కింద బస్తాకు రూ.40 కట్​ చేస్తున్నారని, మొదట 17శాతం తేమ శాతానికి ఒప్పుకొని తర్వాత 14 శాతం అంటున్నారని రైతులు మండిపడ్డారు.

20 రోజులుగా బీట్ లోనే.. 

గొల్లపల్లి మార్కెట్ యార్డులో వడ్లు పోసి 20 రోజులు అయితాంది. 16 ఎకరాల బీట్  వడ్లకుప్పలతో నిండిపోయింది.  వడ్లు ఇప్పుడు 9–10 తేమ శాతం వచ్చినా ఎప్పుడు కొంటారో చెప్తలేరు.  పంట పండించడం కంటే అమ్మడం రెండింతలు కష్టమైతాంది. మిగిలిన రైతులు బీట్ల పోసుకునే జాగ లేక రోడ్లపైనే పోసుకుంటుండ్లు. 

– పడాల సత్యం, రైతు, గొల్లపల్లి