యాదాద్రి జిల్లాలో వడ్ల బ్రోకర్లపై కేసు..400 క్వింటాళ్లు స్వాధీనం

యాదాద్రి జిల్లాలో వడ్ల బ్రోకర్లపై కేసు..400 క్వింటాళ్లు స్వాధీనం
  • ఏఈవో సస్పెన్షన్​, సెంటర్​ ఇన్​చార్జ్​ తొలగింపు

రాజాపేట, వెలుగు :  రైతుల నుంచి తక్కువ రేటుకు వడ్లను కొని కొనుగోలు సెంటర్ లో అమ్మేందుకు యత్నించిన ముగ్గురు బ్రోకర్లపై కేసు నమోదైంది. నిందితుల వద్ద 400 క్వింటాళ్ల వడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆర్డీవో కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా రాజాపేట మండలంలో వడ్ల వ్యాపారం చేసే నక్కిర్తి కనకరత్నం, లక్ష్మి, వస్పరి మహేశ్​ పలువురు రైతుల వద్ద రూ. 1600 నుంచి రూ. 1700 కు క్వింటాల్​చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అవే వడ్లను తమ పేరుపై కొనుగోలు సెంటర్లలో ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర రూ. 2,320 అమ్ముతున్నారు. 

కొనుగోలు సెంటర్లను తనిఖీలు చేస్తున్న ఆఫీసర్లకు సమాచారం అందడంతో  వ్యాపారులను పట్టుకునేందుకు ప్లాన్ చేశారు.  మండలంలోని దూది వెంకటాపురం పీఏసీఎస్​ కొనుగోలు సెంటర్​కు ఆర్డీవో కృష్ణారెడ్డి, సివిల్​సప్లయ్​ డీఎం హరికృష్ణ వెళ్లి తనిఖీలు చేశారు. వడ్ల బ్రోకర్లకు చెందిన 10 వడ్ల కుప్పలు ఉన్నట్టు గుర్తించారు. 

అయితే ఈ ముగ్గురు వడ్లు అమ్మిన విషయం విచారణలో తెలిసింది. సెంటర్ లోని రైతులు కూడా ఆ ముగ్గురు వడ్ల వ్యాపారం చేస్తారని తెలిపారు. దీంతో దాదాపు 400 క్వింటాళ్ల వడ్లను స్థానికంగా ఉన్న మిల్లుకు తరలించి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అనంతరం విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏఈవో ప్రణితను సస్పెండ్​, సెంటర్​ఇన్​చార్జ్​ను విధుల నుంచి తొలగించాలని  కలెక్టర్​ హనుమంతరావు ఆదేశించారు.