T20 World Cup 2024: మ్యాచ్ రద్దయితే ఇంటికే.. దిక్కు తోచని స్థితిలో పాకిస్థాన్, ఇంగ్లాండ్

T20 World Cup 2024: మ్యాచ్ రద్దయితే ఇంటికే.. దిక్కు తోచని స్థితిలో పాకిస్థాన్, ఇంగ్లాండ్

ఒకరేమో 2022 టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్స్.. మరొకరేమో రన్నరప్. ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల గురించి చెబుతున్న మాటలివి. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండు మ్యాచ్ లాడినా ఇంకా బోణీ కొట్టలేదు. స్కాట్లాండ్ పై మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. మరోవైపు పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో పరాజయం పాలైంది. అమెరికా, భారత్ లపై గెలిచే మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ రెండు జట్లు సూపర్ 8 కు అర్హత సాధించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు సూపర్ 8 కు అర్హత సాధించాలంటే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

ఇంగ్లాండ్:

డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టిన ఇంగ్లాండ్ కు ఏదీ కలిసి రావడం లేదు. రెండు మ్యాచ్ లాడితే ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఒక పాయింట్ మాత్రమే ఉంది. మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఒమన్, నమీబియాలతో ఇంగ్లాండ్ గెలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే ఈ రెండు మ్యాచ్ ల్లో ఒకటి ఓడిపోయినా లేకపోతే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా ఇంగ్లాండ్ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమిస్తుంది. అంతేకాదు నెట్ రన్ రేట్ మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే స్కాట్లాండ్ 5 పాయింట్లతో టేబుల్ టాపర్ గా కొనసాగుతుంది. ఆసీస్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఈ రెండు జట్లు సూపర్ 8 కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ రెండు మ్యాచ్ ల్లో భారీ తేడాతో గెలవడంతో పాటు మ్యాచ్ రద్దు కాకుండా ఉంటేనే సూపర్ 8 కు అర్హత సాధిస్తుంది.      

పాకిస్థాన్:

చివరి వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన పాకిస్థాన్ ప్రస్తుత వరల్డ్ కప్ లో సూపర్ 8 చేరుకోవడానికి కష్టాలు పడుతుంది. రెండు మ్యాచ్  లాడినా పాక్ జట్టు ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. మిగిలిన రెండు మ్యాచ్ లు ఖచ్చితంగా గెలవడంతో పాటు ఇతర మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కెనడా, ఐర్లాండ్ లతో మ్యాచ్ లాడాల్సి ఉంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచిన భారత్, అమెరికా మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఒకటి గెలిస్తే పాకిస్థాన్ తమ చివరి రెండు మ్యాచ్ లు గెలిచినా ఇంటిదారి పట్టాల్సి వస్తుంది. ఒకవేళ వర్షం పడి ఏదైనా మ్యాచ్ రద్దయితే పాక్ ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా టర్న్ నుంచి నిష్క్రమిస్తుంది.