టెర్రరిస్ట్‌‌ సయీద్‌‌పై 23 కేసులు: పాక్‌‌

టెర్రరిస్ట్‌‌ సయీద్‌‌పై 23 కేసులు: పాక్‌‌
  • మీ మాటల్ని నమ్మేదెలా?: ఇండియా విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌
  • ‘యాక్షన్ల’ను చేతల్లో చూపించండి
  • ఇంతకు ముందూ చెప్పారు

న్యూఢిల్లీ:  2008 నాటి ముంబై  టెర్రర్‌‌ దాడి ప్రధాన సూత్రధారి హఫీజ్‌‌ సయీద్‌‌ , అతడి అనుచరులపై 23  కేసులు పెట్టామంటూ పాకిస్థాన్‌‌ ప్రకటించిన మరుసటి రోజే ఇండియా  దీనిపై గట్టిగా రియాక్ట్‌‌ అయింది.  పాక్‌‌ చర్యను ‘‘డబుల్‌‌ స్టాండర్డ్‌‌’’గా విమర్శించింది.కేవలం  టెర్రిరిస్టులు, టెర్రర్‌‌ గ్రూపులపై కేసులు పెట్టామంటే సరిపోదని.. టెర్రరిజాన్ని రూపుమాపేదిశగా తీసుకునే చర్యల్ని బట్టే  ఆదేశం చేసిన ప్రకటనలను నమ్మాల్సివస్తుందని మన విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్‌‌ కుమార్‌‌ గురువారం ఇక్కడి మీడియా సమావేశంలో చెప్పారు. ‘‘టెర్రరిస్టులపై ఇలాంటి చర్యలు తీసుకున్నట్టు పాకిస్తాన్‌‌ ఇంతకుముందు కూడా చెప్పింది.  ఆ మాటలు  నమ్మాలో లేదో తేల్చుకోవడానికి  వెరిఫై చేయాల్సి ఉంటుంది’’ అని కుమార్‌‌ తెలిపారు. టెర్రర్‌‌ కార్యకలాపాల కోసం ఐదు ట్రస్టుల ద్వారా  నిధులు, డొనేషన్లు సేకరించినట్టు వచ్చిన ఆరోపణలపై  సయీద్, ఆయన అనుచరులపై  23 కేసుల్ని పెట్టినట్టు  పాకిస్థాన్‌‌  కౌంటర్‌‌ టెర్రరిజం డిపార్ట్‌‌మెంట్‌‌ బుధవారం ప్రకటించింది.

సయీద్‌‌, ఆయన సన్నిహితులు 12 మందిని త్వరలోనే అరెస్టు చేస్తామని పాక్‌‌ ప్రకటించింది. ట్రస్టులు, డొనేషన్ల ద్వారా సేకరించిన నిధుల్ని ఉపయోగించే ముంబై ఎటాక్‌‌కు  సయీద్‌‌ వ్యూహరచన చేసినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ ఎటాక్‌‌లో 166 మంది అమాయకులు చనిపోయిన సంగతి తెలిసిందే. బ్యాన్‌‌ చేసిన లష్కరే తోయిబాతో సంబంధాలున్న  జామత్‌‌ ఉద్‌‌ దవా, ఫలా ఐ ఇన్సానియాత్ ఫౌండేషన్‌‌లను కూడా  టార్గెట్‌‌గా పెట్టుకున్నామని పాక్‌‌ వర్గాలు చెప్పాయి.  ఈ ఆర్గనైజేషన్లకు సంబంధించిన ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నామని  తెలిపాయి.

ఫైనాన్షియల్‌‌  యాక్షన్‌‌ టాస్క్‌‌ ఫోర్స్‌‌ ( ఎఫ్‌‌ఏ టీఎఫ్‌‌) కిందటేడాది పాకిస్థాన్‌‌ను ‘గ్రే లిస్ట్‌‌’లో  ఉంచింది.  టెర్రరిస్టులకు ఫైనాన్స్‌‌ చేయడం, మనీ లాండరింగ్‌‌ను ప్రోత్సహించడం లాంటి చర్యలకు పాల్పడే దేశాలపై ఎఫ్‌‌ఏ టీఎఫ్‌‌  ‘గ్రే లిస్ట్‌‌’లో ఉంచుతుంది. ఈలిస్ట్‌‌లో చేరిన దేశాలకు వరల్డ్‌‌ బ్యాంక్‌‌ లాంటి ప్రపంచ సంస్థల నుంచి ఆర్థిక సాయం అందదు. గ్రేలిస్ట్‌‌ నుంచి బయటపడడానికి పాకిస్థాన్‌‌కు  ఎఫ్‌‌ఏటీఎఫ్‌‌కు అక్టోబరు  వరకు గడువు ఇచ్చింది.  టాస్క్‌‌ ఫోర్స్‌‌ ఒత్తిడితో టెర్రరిస్టులపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి పాకిస్థాన్‌‌కు ఏర్పడింది.

లష్కరే తోయిబా  టెర్రర్‌‌ సంస్థ స్థాపకుల్లో ఒకడైన సయీద్‌‌ను గ్లోబల్‌‌ టెర్రరిస్టుగా ఇప్పటికే అమెరికా, యూఎన్‌‌ఓ ప్రకటించింది. సయీద్‌‌ దోషిగా గుర్తించామని చెప్పడానికి తగిన సాక్ష్యాలను పాకిస్థాన్‌‌ చూపిస్తే పది మిలియన్‌‌ డాలర్ల రివార్డ్‌‌ కూడా ఇస్తామని కూడా  అమెరికా ఇంతకుముందే  ప్రకటించింది.  2002లోనే లష్కరే తోయిబాను పాకిస్థాన్‌‌ బ్యాన్‌‌ చేసింది. అమాయకుల్ని చంపిన ఘటనలు, , మిలిటెంట్లకు ఫండింగ్‌‌ చేస్తున్న  ఆరోపణలపై  ఇంతకుముందు సయీద్‌‌పై పలు కేసులు నమోదయ్యాయి. ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు  .  కోర్టులు  సయీద్‌‌ నిర్ధోషని తీర్పు ఇవ్వడంతో  ఆయనను పాకిస్థాన్‌‌ అధికారులు విడిచిపెట్టారు.