పాకిస్తాన్‌‌ మిలిటరీ పొలంబాట! ..10 లక్షల ఎకరాల్లో వ్యవసాయం

పాకిస్తాన్‌‌ మిలిటరీ పొలంబాట! ..10 లక్షల ఎకరాల్లో వ్యవసాయం
  • ఆహార కొరత నేపథ్యంలో రంగంలోకి ఆర్మీ
  • ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు పడించే ప్లాన్
  •  పాక్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఆర్థిక మాంధ్యం.. ఆహార ధాన్యాల కొరత.. విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసరాల ధరలు.. చేతిలో చిల్లి గవ్వ లేదు.. ప్రజా జీవనం అస్తవ్యస్థం.. ఇదీ పాకిస్తాన్ పరిస్థితి. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. ఆయుధాలు పట్టి సరిహద్దుల్లో కాపలా కాసే ఆర్మీ.. 10 లక్షల ఎకరాల్లో వ్యవసాయం చేసేందుకు సిద్ధమైంది. కానీ.. పాకిస్తాన్‌‌లో ప్రభుత్వం కన్నా ఆర్మీనే పవర్‌‌‌‌ఫుల్. దేశాన్ని ఎక్కువ కాలం పాలిం చింది ఆర్మీనే.  ప్రభుత్వాలను గద్దె దించి అధికారం చేజిక్కించుకున్న ఆర్మీకి.. లక్షల ఎకరాలు అప్పగించడమేంటి?  ఆర్మీని రంగంలోకి దించడమేంటి?

ఇస్లామాబాద్:  ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తమ దేశాన్ని గట్టెక్కించేందుకు పాక్ ఆర్మీ రంగంలోకి దిగింది. ప్రజల ఆకలి బాధలు తీర్చేందుకు పాక్ ఆర్మీ భారీ స్థాయిలో వ్యవసాయ భూములను సాగు కోసం తీసుకుంటున్నది. దాదాపు 10 లక్షల ఎకరాలను లీజుకు తీసుకుని, ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు పడించనుంది. ఇందుకు సంబంధించి పాక్ ప్రభుత్వం రూపొందించిన ప్లాన్‌‌ను ‘నిక్కీయ్ ఆసియా’ అనే పత్రిక బయటపెట్టింది. అయితే ఈ ప్లాన్‌‌పై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు పెట్టుబడి సాయం చేసి ఆదుకోవడానికి బదులు.. సాగు అనుభవం లేని ఆర్మీకి బంజరు భూములను అప్పజెప్పడం ఏంటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయంతో మంచి కంటే చెడు ఎక్కువ జరిగే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఎప్పటి నుంచి సాగు చేస్తరు?

పాక్ ప్రభుత్వం తయారు చేసిన ఈ బ్లూ ప్రింట్‌‌పై అనేక అనుమానాలు ఉన్నాయి. మొత్తం భూములు పూర్తిగా సాగులోకి ఎప్పుడు వస్తాయనే దానిపై క్లారిటీ లేదు. ‘‘ఆర్మీకి బదిలీ కానున్న భూమిలో ఎక్కువ భాగం చోలిస్తాన్ ఎడారి ప్రాంతంలో ఉంది. అవన్నీ తీవ్రమైన నీటి కొరత ఉండే మెట్ట భూములు. వాటితోపాటు 1,10,000 ఎకరాల అదనపు భూమి పక్క జిల్లాల్లో ఉంది” అని నిక్కీయ్ ఆసియా తన నివేదికలో పేర్కొంది. ఇక సైన్యానికి బదిలీ చేసే భూమి ఇప్పటికే సాగులో ఉందా? చిన్న భూ యజమానుల చేతుల్లో ఉందా? అనేది కూడా స్పష్టత లేదు. అయితే, ఈ ఆందోళనలను ‘ఫౌజీ ఫౌండేషన్ ఇన్వెస్ట్‌‌మెంట్(ఎఫ్ఎఫ్ఐ)’ గ్రూప్‌‌లోని ‘ఫంగ్రో’ కొట్టిపారేసింది. ‘‘ఆర్మీకి బదిలీ చేసే భూముల్లో చాలా వరకు బంజరు భూములే. అంటే దీనర్థం.. రైతులకు ఎలాంటి నష్టం జరగదు” అని ఫంగ్రో మేనేజర్‌‌‌‌ చెప్పారు. సాగుపై అవగాహన కూడా సరిగ్గా లేని సైన్యం.. ఎడారి ప్రాంతాన్ని సారవంతమైన సాగు భూమిగా ఎలా మారుస్తుంది? పంట దిగుబడి ఎలా పెంచుతుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

అతిపెద్ద భూ యజమానిగా ఆర్మీ

అయితే ప్రభుత్వం రూపొందించిన ఈ ప్లాన్ ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అన్ని వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నది. ఇప్పటికే శక్తివంతమైన సంస్థగా ఉన్న ఆర్మీ.. ఈ ఆహార భద్రత ప్లాన్‌‌తో భారీ లాభాలను పొందే అవకాశం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్‌‌లోని 2.5 కోట్ల గ్రామీణ భూమిలేని పేదలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద మొత్తంలో భూమిని బదిలీ చేస్తే.. దేశంలోనే అతిపెద్ద భూ యజమానిగా ఆర్మీ మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో ఆర్మీ ఫామ్‌‌లను నడిపి న మిలిటరీ వ్యక్తులు.. పేద రైతులను దోపిడీ చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. ‘‘విదేశీ ముప్పు నుంచి రక్షించడం, ప్రభుత్వానికి అవసరమైనప్పుడు సాయం చేయడమే ఆర్మీ పని. అంతకుమించి ఇంకేమీ ఉండకూడదు” అని ఓ లాయర్ అన్నారు.

30 ఏండ్లకు లీజు

‘‘ఈ కొత్త ఫుడ్‌‌ సెక్యూరిటీ కార్యక్రమాన్ని ఈ ఏడాది మొదట్లో ప్రారంభించారు. లీజుకు తీసుకునే ప్రభుత్వ భూముల్లో సైన్యం ద్వారా సాగు చేయించి పంట ఉత్పత్తిని పెంచాలని యోచిస్తున్నారు” అని తన రిపోర్టులో ‘నిక్కీయ్ ఆసియా’ పేర్కొంది. ఈ ప్లాన్ ప్రకారం పంజాబ్‌‌ ప్రావిన్స్‌‌లోని 10 లక్షల ఎకరాలను సేకరించ నుందని తెలిపింది. మంచి పంట దిగుబడిని సాధిస్తారని, అలాగే నీటిని ఆదా చేస్తారని పేర్కొన్నట్లు చెప్పింది. ‘‘గోధుమలు, పత్తి, చెరుకుతోపాటు కూరగాయలు, పండ్లు తదితర పంటలను ఆర్మీ పండించనుంది. ఇందుకోసం 10 లక్షల ఎకరాలను 30 ఏండ్లకు లీజుకు తీసుకోనుంది. పంట అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతాన్ని వ్యవసాయంలో రీసెర్చ్‌‌లు, అభివృద్ధి కోసం కేటాయిస్తారు. మిగతా 80 శాతాన్ని ఆర్మీ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం పంచుకోనున్నాయి” అని ప్రభుత్వ డాక్యుమెంట్లలో ఉన్నట్లు వెల్లడించింది.