రైతులుగా మారిన పాకిస్తాన్ సైన్యం : 10 లక్షల ఎకరాల్లో పంటల సాగు

రైతులుగా మారిన పాకిస్తాన్ సైన్యం : 10 లక్షల ఎకరాల్లో పంటల సాగు

సైన్యం.. దేశ భద్రతలో కీలక పాత్ర. ఇప్పుడు ఆ సైన్యం జనం కోసం.. జనం అవసరాల కోసం ముందుకు వచ్చింది. తుపాకులు పట్టే చేతులు ఇప్పుడు నాగళ్లు పడుతున్నాయి.. యుద్ధ ట్యాంకులు నడిపే జవాన్లు.. ట్రాక్టర్లు ఎక్కారు.. శత్రువులను చంపే చేతులు ఇప్పుడు పంటలు పండిస్తున్నాయి. సరిహద్దుల్లో గస్తీ కాసే సైన్యం ఇప్పుడు పొలాల్లో మట్టి పనులు చేస్తున్నాయి.. గడ్డ కట్టే చలిలో.. జోరు వానలో.. మండే ఎండలో శత్రువుల కోసం వేచి చూసి ఆ కళ్లు ఇప్పుడు.. కలుపు మొక్కలు పీకుతున్నాయి.. అవును.. ప్రపంచంలోనే మొదటిసారి.. ఓ దేశ సైన్యం వ్యవసాయం చేస్తుంది. అదే పాకిస్తాన్ సైన్యం. ఇప్పుడు యుద్ధ ట్యాంకులు వదిలేసి.. ట్రాక్టర్లు ఎక్కుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పాకిస్తాన్ దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. పాక్ జనం తినటానికి తిండి లేక అలమటిస్తున్నారు. విదేశీ మారక నిల్వలు తగ్గిపోవటంతో.. ధరలు ఆకాశాన్ని అంటాయి. లీటర్ పెట్రోల్ 350 రూపాయలకు చేరుకుంది. పాక్ లో ఆహార సంక్షోభం రావటంతో.. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది అక్కడి ప్రభుత్వం. 

Also Read : రాష్ట్రంలో 17సార్లు పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయి : కిషన్ రెడ్డి

ఈ క్రమంలోనే పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో లక్ష ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నది పాక్ ఆర్మీ. ఇందులో గోధుమలు, పత్తి, చెరకుతోపాటు కూరగాయలు పండించనున్నారు సైన్యం. దీని ద్వారా పాక్ దేశంలో ఆహార సంక్షోభాన్ని తగ్గించాలని నిర్ణయించింది అక్కడి ప్రభుత్వం. ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది పాక్ రక్షణ శాఖ. లక్ష ఎకరాల్లో పంటల సాగు ద్వారా ఆదాయాన్ని ఎవరెవరికి ఎంత అనేది కూడా డిసైడ్ చేసుకున్నారు. మొత్తం లాభంలో 20 శాతం అభివృద్ధి నిధి కింద ఉంచుతారు. మిగతా 80 శాతంలో.. 40 శాతం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి.. మరో 40 శాతం పాకిస్తాన్ ఆర్మీకి చెందుతుంది. 

ప్రస్తుతం పాకిస్తాన్ లో రెండున్న కోట్ల మంది జనం.. కనీసం రెండు పూటల ఆహారం తీసుకోని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. పాక్ దేశం మొత్తంలో 12 కోట్ల మంది దరిద్రంలో బతుకుతున్నారు. పాక్ దేశం మనుగడ సాగించాలంటే వెంటనే కఠిన సంస్కరణలు అమలు చేయాలని.. తీవ్ర నిర్ణయాలు తీసుకోవాలని.. ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం బయటకు రావటం విశేషం. 

దేశంలో ఆహార సంక్షోభాన్ని నివారించటానికి.. ఏకంగా దేశ సైన్యాన్ని వ్యవసాయ రంగంలోకి దించటం.. ప్రపంచంలో ఇదే మొదటిసారి అంటున్నారు నిపుణులు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు పాక్ దేశం. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఇది సరైన నిర్ణయం అని అంటున్నారు సామాజిక వేత్తలు, ఆర్థిక శాఖ నిపుణులు. సైన్యం అంటే యుద్ధం చేయటం మాత్రమే కాదు.. శత్రువులను చంపటం మాత్రమే కాదు.. దేశం కోసం.. దేశ ప్రజల కోసం ఇలాంటి పనులు చేయటానికి కూడా ముందుకు రావాల్సిన అసవరం ఉందంటున్నారు.