మన దేశం ఆతిథ్యం ఇచ్చే ఆసియా కప్ హాకీలో పాక్‌ పాల్గొంటుందా ?

మన దేశం ఆతిథ్యం ఇచ్చే ఆసియా కప్ హాకీలో పాక్‌ పాల్గొంటుందా ?

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పరిణామాల తర్వాత ఈ ఏడాది ఇండియా ఆతిథ్యం ఇచ్చే ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడం సందేహంగా మారింది. ఈ విషయంపై హాకీ ఇండియా (హెచ్‌‌ఐ) కేంద్ర ప్రభుత్వ సలహా కోసం ఎదురుచూస్తోంది. ఈ మెగా టోర్నీ బీహార్‌‌లోని రాజ్‌‌గీర్‌‌లో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరగనుంది.

ఆతిథ్య  ఇండియాతో పాటు పాకిస్తాన్, జపాన్, కొరియా, చైనా, మలేసియా, ఒమన్, చైనీస్ తైపీ జట్లు పాల్గొనాల్సి ఉంది. వచ్చే ఏడాది నెదర్లాండ్స్‌‌లో జరిగే హాకీ వరల్డ్ కప్‌‌కు క్వాలిఫయింగ్ ఈవెంట్ కావడంతో ఆసియా జట్లకు ఈ టోర్నీ కీలకం కానుంది. మెగా టోర్నీకి పాక్‌‌ వస్తుందా? ఆ జట్టు మన దేశంలో ఆడేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందా? అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. దీనిపై హెచ్‌‌ఐ సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్ మాట్లాడుతూ  ‘ప్రస్తుతం ఏమీ చెప్పలేం.

పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి, ఆ తర్వాత ఇండియా  నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పరిస్థితులను అంచనా వేయలేం. టోర్నమెంట్‌‌కు ఇంకా మూడు నెలల సమయం ఉంది. ప్రభుత్వం ఏం సూచిస్తే, దానిని ఖచ్చితంగా అమలు చేస్తాం’ అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ పాకిస్తాన్‌‌తో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలన్నా, ఉగ్రవాదంపై ఆ దేశం స్పష్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆధారాలు ఉండాలని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోతే పాకిస్తాన్ జట్టు ఇండియా రాదని హాకీ ఇండియా వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ పాక్ టీమ్ గైర్హాజరైతే టోర్నమెంట్‌‌ను ఏడు జట్లతో నిర్వహించాలా లేక కొత్త జట్టును చేర్చాలా? అనే నిర్ణయం ఆసియా హాకీ ఫెడరేషన్ తీసుకుంటుంది. 2016లో ఇండియాలో జరిగిన జూనియర్ వరల్డ్ కప్‌‌లో పాకిస్తాన్ హాకీ జట్టు పాల్గొనలేదు. ఆ సమయంలో పఠాన్‌‌కోట్ ఎయిర్ బేస్‌‌పై జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ టోర్నమెంట్‌‌లో పాకిస్తాన్ స్థానంలో మలేసియా జట్టు చేరింది.