తిండి లేక నకనకలాడుతున్న పాకిస్తాన్​ ప్రజలు

తిండి లేక నకనకలాడుతున్న పాకిస్తాన్​ ప్రజలు
  • పని దొరకక, తిండి లేక నకనకలాడుతున్న పాకిస్తాన్​ ప్రజలు
  • శ్రీలంక పరిస్థితే తమకూ తప్పదేమోనని పాక్​నిపుణుల ఆందోళన

ఇస్లామాబాద్: పాకిస్తాన్​లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. అమెరికా డాలర్​తో పోలిస్తే, రూపాయి విలువ పడిపోతోంది. ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో సామాన్యులకు కడుపునిండా తిండి దొరకట్లేదని జనం వాపోతున్నారు. మూడు పూటలా తిండి తినే అలవాటు మానేసి చాలా రోజులైందని కరాచీకి చెందిన జాఫర్​ ఇక్బాల్​ అనే వృద్ధుడు చెప్పారు. పరిశ్రలు చాలా వరకు కరెంటు, ముడి పదార్థాల కొరతతో మూతపడ్డాయని అన్నారు. దీంతో చాలా మందికి పని దొరకట్లేదని, దీంతో వాళ్ల కుటుంబం మొత్తం పస్తులు ఉండాల్సి వస్తోందని అన్నారు. ధరలు పెరగడంతో ఉదయాన్నే తినాల్సిన బ్రేక్​ ఫాస్ట్​ను మధ్యాహ్నం తింటున్నామని, లంచ్​, డిన్నర్​ (రెండు పూటలనూ) కలిపేసి సాయంత్రం ఒకేసారి తింటున్నామని మరో మహిళ తెలిపారు. మిగతా టైంలో ఆకలి వేస్తే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ నీళ్లతో కడుపు నింపుకోవాల్సిందేనని చెప్పారు.

పెరుగుతున్న ధరలు.. 
ఇప్పటికే ప్రభుత్వం పెట్రోల్ రేట్లను భారీగా పెంచింది. ఇప్పుడక్కడా లీటర్ పెట్రోల్ రూ.250 కి చేరింది. కరెంట్ సప్లై లేక జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, చివరికి తమకు కూడా శ్రీలంక దుస్థితి పడుతుందని అక్కడి ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రభుత్వానికి మరో మార్గం లేదు. ఐఎంఎఫ్ డిమాండ్లకు తలొగ్గాల్సిందే. లేదంటే దేశ పరిస్థితి మరింత దిగజారుతుంది. డిఫాల్టర్​గా మారి, చివరికి శ్రీలంకలా అయిపోతుంది” అని వరల్డ్ బ్యాంక్ మాజీ ఎకానమిస్ట్ అబిద్ హసన్ ఆవేదన వ్యక్తంచేశారు. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పన్నులు పెంచాలని, సబ్సిడీలు తగ్గించాలని పాక్ కు ఐఎంఎఫ్ సూచించింది. అయితే, అక్టోబర్ లో ఎన్నికలు ఉండడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు మరో మార్గంలేక ఐఎంఎఫ్ డిమాండ్లను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా, పోయినేడాది శ్రీలంక డిఫాల్టర్ గా మారింది. తిండికి, ఆయిల్ కి ఆ దేశంలో తీవ్రమైన కొరత ఏర్పడింది. జనమంతా రోడ్లెక్కి నిరసనలు చేశారు. చివరికి దేశాధ్యక్షుడు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.