శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్‌పై చైనా, పాకిస్తాన్ కన్నేశాయి. చైనా ఆదేశాల మేరకు చీనాబ్ బ్రిడ్జికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సేకరిస్తున్నట్లు పలు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే, ఆ వివరాలు ఎందుకు తెలుసుకుంటున్నారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. జమ్మూకాశ్మీర్‌లోని రియాసి, రాంబన్ జిల్లాలను కలిపేందుకు చీనాబ్ నదిపై చేపట్టిన రైల్వే బ్రిడ్జి నిర్మాణం ఇటీవల పూర్తయ్యింది.
ప్రపంచలోనే అత్యంత పొడవైన రైల్వే వంతెనగా చీనాబ్ బ్రిడ్జి రికార్డులోకి ఎక్కింది. భారీగా మంచు పడుతుండటం వల్ల జమ్మూకాశ్మీర్‌లోని రోడ్లపై రాకపోకలు చేయటం కష్టంగా మారింది. దాంతో రైలు మార్గం ద్వారా కాశ్మీర్‌ను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఉధంపుర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ (యూఎస్బీఆర్ఎల్)ప్రాజెక్టును చేపట్టింది. చీనాబ్ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో బ్రిడ్జిని నిర్మించింది.