ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఐదేండ్ల నిషేధం 

ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఐదేండ్ల నిషేధం 

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఐదేండ్ల పాటు నిషేధం విధించింది. ఈ మేరకు తోషాఖానా కేసులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సికందర్ సుల్తాన్ రాజా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.

అవినీతి నిరోధక చట్టాల ప్రకారం ఇమ్రాన్​పై చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే విచారణ ముగించి జడ్జిమెంట్ రిజర్వ్​లో పెట్టిన  బెంచ్.. శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈసీ నిర్ణయంతో ఇమ్రాన్ ఎంపీ పదవిని కోల్పోనున్నారు. కాగా, ఈసీ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని పీటీఐ జనరల్ సెక్రటరీ అసద్ ఉమర్ చెప్పారు. 

ఏంటీ కేసు? 

పాక్ ప్రధానులకు విదేశీ నేతల నుంచి వచ్చే ఖరీదైన బహుమతులను ట్రెజరీ(తోషాఖానా)లో దాస్తుంటారు. తమ హయాంలో వచ్చిన బహుమతులను ప్రధానులు తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అలా తన హయాంలో వచ్చిన కొన్ని బహుమతులను ఇమ్రాన్ డిస్కాంట్ ధరకు ట్రెజరీ నుంచి కొనుగోలు చేశారు. వాటిని మార్కెట్​లో ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. వచ్చిన మొత్తాన్ని ఇమ్రాన్ ఇన్​కమ్ ట్యాక్స్ రిటర్న్స్​లో చూపించలేదని, కొన్ని గిఫ్టులను ట్రెజరీకి పంపించలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇమ్రాన్​పై అనర్హత వేటు వేయాలని ఎలక్షన్ కమిషన్​కు ఫిర్యాదు చేశాయి.