
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎప్పుడో దివాలా తీసిందని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. దేశమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. దేశం ఈ పరిస్థితికి దిగజారడానికి అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులే కారణమని విమర్శించారు. ఆయన సొంతూరు సియాల్కోట్లో నిర్వహించిన ఓ ప్రోగ్రాంకు హాజరై మాట్లాడారు. తమ కాళ్లపై తాము నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎవరు.. ఏవిధంగా సాయం చేసినా సంక్షోభం నుంచి బయటికి రాలేమని స్పష్టం చేశారు. ‘‘పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది.. దివాలా తీస్తున్నదని.. మీరు వింటున్నారు. అది ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు మనమంతా దివాలా తీసిన దేశంలో బతుకుతున్నాం” అని ఖవాజా ఆసిఫ్ అన్నారు. ‘‘మన దేశం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం ఇక్కడే ఉంది. ఐఎంఎఫ్ వద్ద లేదు. పాక్‌లో చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఎవరూ పాటించట్లేదు. అందుకే దేశం దివాలా తీసింది. అధికార యంత్రాంగంతో పాటు ప్రతీ రాజకీయ నాయకుడు దీనికి కారణం”అని ఆసిఫ్ ప్రకటించారు.
దేశ రాజకీయాలు దిగజారాయ్..
గడిచిన 32 ఏండ్లుగా దేశ రాజకీయాలు ఎలా దిగజారాయో డైరెక్ట్‌గా చూశానని ఖవాజా ఆసిఫ్ గుర్తు చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాలనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రెండున్నరేండ్ల కిందే టెర్రరిస్టులను పాకిస్తాన్‌కు తీసుకొచ్చారని ఆరోపించారు. వాళ్లే ఇప్పుడు దేశంలో టెర్రరిజానికి కారణం అవుతున్నారని మండిపడ్డారు.