ఇంకా చీకట్లోనే పాకిస్తాన్

ఇంకా చీకట్లోనే పాకిస్తాన్

ప్రజలకు ప్రధాని షరీఫ్​ క్షమాపణ

చాలా నగరాలకు విద్యుత్ పునరుద్ధరించామన్న మంత్రి

ఇస్లామాబాద్ : గ్రిడ్ ఫెయిల్యూర్  కారణంగా చీకట్లో కి వెళ్లిపోయిన పాకిస్తాన్​ను రెండో రోజూ కరెంటు కష్టాలు వదలలేదు. దేశంలోని చాలా నగరాలు మంగళవారం కూడా చీకట్లోనే గడిపాయి. సోమవారం ట్రాన్స్ మిషన్ లైన్స్​లో లోపం వల్ల గ్రిడ్ ఫెయిలై  కరెంటు సరఫరా ఆగిపోయింది. విద్యుత్ పునరుద్ధరణ కోసం సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. కరాచీ, ఇస్లామాబాద్, క్వెట్టా వంటి నగరాల ప్రజలు కరెంటు లేకుండానే గడిపారని అక్కడి మీడియా వెల్లడించింది. దీంతో ప్రజలకు ప్రధాని షెహబాజ్  షరీఫ్​  క్షమాపణ చెప్పారు. ‘‘కరెంటు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు నా ప్రభుత్వం తరపున సారీ చెబుతున్నా. గ్రిడ్ ఫెయిల్యూర్ పై ఎంక్వయిరీ జరుపుతున్నం. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తం” అని ప్రధాని ట్వీట్  చేశారు. అయితే మంగళవారం చాలా వరకు గ్రిడ్  ఫెయిల్యూర్​ను పరిష్కరించామని, దేశంలోని చాలా నగరాలకు కరెంటు సరఫరా చేశామని ఇంధన శాఖ మంత్రి ఖుర్రం దస్తగిర్  పేర్కొన్నారు. దేశంలోని 1,112 స్టేషన్లలో విద్యుత్​ను పునరుద్ధరించామని ‘డాన్’  న్యూస్ పేపర్​కు ఆయన చెప్పారు. ఉదయం 5.15 గంటల్లోపు దేశవ్యాప్తంగా మొత్తం సిస్టంను రెస్టోర్  చేశామన్నారు.

ఇంకా పూర్తి స్థాయిలో కరెంట్  సరఫరా చేయాల్సి ఉందని, అందు కోసం 48 నుంచి 72 గంటల సమయం పట్టవచ్చని చెప్పారు. 6,600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బొగ్గు, 3,500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న న్యూక్లియర్  ప్లాంట్లు ఫుల్  కెపాసిటీతో పనిచేసే వరకు పారిశ్రామిక అవసరాలను మినహాయించి మిగతా వారికి పరిమితంగా కరెంట్ సరఫరా చేస్తామన్నారు. ప్రజలు చెల్లించాల్సిన కరెంటు బిల్లుల గురించి డిస్కస్  చేస్తున్నామని, ఇంధనం బాగా అవసరమయ్యే పవర్  ప్లాంట్లను ఉపయోగించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని మంత్రి పేర్కొన్నారు.