పాక్​లో లీటర్ పెట్రోల్@250

పాక్​లో లీటర్ పెట్రోల్@250

తాజాగా లీటరుకు రూ.35 చొప్పున పెంపు

కిరోసిన్ పై రూ.18 పెంపు

బంకుల వద్ద క్యూ కట్టిన జనం 

ఇస్లామాబాద్ : ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్.. పెట్రోల్​ రేట్లను భారీగా పెంచింది. లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.35 చొప్పున.. కిరోసిన్, లైట్ డీజిల్ పై రూ.18 చొప్పున పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.249.80, హైస్పీడ్ డీజిల్ రూ.262.80, కిరోసిన్ రూ.189.83, లైట్ డీజిల్ రూ.187కు చేరింది. ఆదివారం ఉదయం ఆర్థిక మంత్రి ఇషాఖ్ దార్ టీవీలో మాట్లాడుతూ పెట్రోల్​ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. పాకిస్తాన్ రూపీ విలువ దారుణంగా పడిపోయిందని, దీంతో అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రో ఉత్పత్తుల ధర 11 శాతం పెరిగిందని తెలిపారు. కాగా, అమెరికా డాలర్ తో పోలిస్తే పాకిస్తాన్ రూపీ విలువ బాగా తగ్గింది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ 262.6 పాకిస్తాన్ రూపీలుగా ఉంది. 

రానున్న రోజుల్లో మరింత పెంపు... 

పెట్రోల్, డీజిల్ కు కొరత ఉందని.. రేట్లు పెంచనున్నారని శనివారం రాత్రి నుంచే సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆదివారం మబ్బుల నుంచే జనం పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు. రానున్న రోజుల్లో రేట్లు మరింత పెరుగుతాయని ఎక్స్ పర్ట్ ఫహద్ రౌద్ తెలిపారు. ఫిబ్రవరి రెండో వారంలో ధరలు పీక్ కు వెళ్తాయని చెప్పారు. అయితే ఆయిల్ కు కొరతేమీ లేదని, మార్కెట్ లో కావాలనే కొరత సృష్టిస్తున్నారని అధికారులు తెలిపారు. ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని పీటీఐ చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. ప్రస్తుత సర్కార్ కు దేశాన్ని నడపడం రావట్లేదని, అందుకే ఆర్థిక సంక్షోభం తలెత్తిందని మండిపడ్డారు.