
అవినీతి ఆరోపణల నేపథ్యంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కావడంతో ఆ దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు, హింస చెలరేగాయి. అతని మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు దేశంలో భారీ నిరసనలు చేపడుతున్నారు. లాహోర్, రావల్పిండి వంటి నగరాల్లో ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ , ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రాపై ఫిర్యాదు చేయాలని కోరుతూ ఆమె ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
‘‘ఢిల్లీ పోలీసుల ఆన్‌లైన్ లింక్ ఎవరికైనా తెలుసా? నా దేశం పాకిస్తాన్‌లో గందరగోళం, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న భారత ప్రధాని, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ RAW పై ఫిర్యాదు చేయాలి. భారత కోర్టులు స్వేచ్ఛగా ఉంటే భారత సుప్రీంకోర్టు నాకు న్యాయం చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ షిన్వారీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
https://twitter.com/DelhiPolice/status/1655987919218434050
సెహర్ షిన్వారీ చేసిన ట్వీట్ పై ఢిల్లీ పోలీసులు రియాక్ట్ అయ్యారు. పాకిస్తాన్‌లో తమకు అధికార పరిధి లేదని మేము భయపడుతున్నాము. కానీ.. మీ దేశంలో ఇంటర్నెట్ ఆపివేయబడినప్పుడు మీరు ఎలా ట్వీట్ చేస్తున్నారో తెలుసుకోవాలని అను కుంటున్నామని షిన్వారీని పోలీసులు ప్రశ్నించారు.
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ క్రమంలో దేశంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మొబైల్ డేటా సేవలను నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ హోంశాఖ ప్రకటించింది. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లపై ఆంక్షలు ఉన్నాయని గ్లోబల్ ఇంటర్నెట్ మానిటర్ నెట్ బ్లాక్స్ వెల్లడించింది.
మరోవైపు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్టబద్ధమైనదని ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇమ్రాన్‌ఖాన్ అరెస్టును చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టి ఈ తీర్పును వెలువరించింది. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) వారెంట్ తర్వాత ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు.