- పాలమూరు అబ్జర్వర్ కాత్యాయని దేవి
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకురాలు, సెర్ప్ అడిషనల్ సీఈవో కాత్యాయని దేవి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో కలెక్టర్ విజయేందిర బోయి, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ బాబుతో కలిసి నోడల్ ఆఫీసర్స్ తో మొదటి విడత ఎన్నికల ఏర్పాట్లను రివ్యూ చేశారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు, వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు నియమించిన స్టేజ్ 1,స్టేజ్ 2 ఆర్వోలు, ఏఆర్వోలు, పీవో, ఏపీవోలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.
మైక్రో అబ్జర్వర్లకు సైతం ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది ర్యాండమై జేషన్ ను టీ పాల్ సాఫ్ట్వేర్ ద్వారా నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌలతులు కల్పించాలని, కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ గ్రీవెన్స్ సెల్ ద్వారా ఫిర్యాదులు పరిష్కరించాలన్నారు. క్రిటికల్ పోలింగ్ సెంటర్ల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ లు, ఎస్ఎస్టీ బృందాలు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అంతకుముందు అబ్జర్వర్ రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడెం, నవాబుపేట గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన క్లస్టర్ నామినేషన్ సెంటర్లను పరిశీలించారు. నామినేషన్ పత్రంతోపాటు అందజేయాల్సిన పత్రాలను పరిశీలించి, హెల్ప్ డెస్క్ సిబ్బందితో మాట్లాడారు.
