తల్లి చనిపోయిన విషయం దాచి.. షూటింగ్ కంప్లీట్ చేశాడు.. డైరెక్టర్ స్పీచ్తో హీరో తిరువీర్ కన్నీళ్లు

తల్లి చనిపోయిన విషయం దాచి.. షూటింగ్ కంప్లీట్ చేశాడు.. డైరెక్టర్ స్పీచ్తో హీరో తిరువీర్ కన్నీళ్లు

తిరువీర్, టీనా శ్రావ్య జంటగా  రాహుల్ శ్రీనివాస్‌‌‌‌ దర్శకత్వంలో  సందీప్ అగ‌‌‌‌రం, అష్మితా రెడ్డి నిర్మించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. నవంబర్ 7న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్ ఆకట్టుకోగా, మంగళవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల  చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌కు దర్శకులు కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్  అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.

హీరో తిరువీర్ మాట్లాడుతూ ‘దర్శకుడు రాహుల్ కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నా. అంతే సరదాగా షూటింగ్ చేశాం. మంచి కంటెంట్‌‌‌‌తో మా చిత్రం రాబోతోంది. అందరికీ కచ్చితంగా  నచ్చుతుంది’ అని అన్నాడు. ప్రతి ఒక్కర్నీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేసేలా సినిమా ఉంటుందని టీనా శ్రావ్య చెప్పింది.

డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ.. ‘తిరువీర్‌ను నేను ఓ నాటకంలో చూశాను. నేను మూవీ తీస్తే తిరువీర్‌కి పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ‘పలాస’లో మూడు పాత్రలు అనుకున్నప్పుడు అందులో తిరువీర్ ఉండాలని డిసైడ్ అయ్యాను. ‘పలాస’ కోసం మేం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. తల్లి చనిపోయినా కూడా తిరువీర్ ఆ విషయాన్ని మాకు చెప్పకుండా షూటింగ్‌లో సీన్‌ చేశాడు. అలా తిరువీర్ మాకు ఎంతో సహకరించారు. అందరూ తప్పకుండా ప్రీ వెడ్డింగ్ షో చూడండి’ అని అన్నారు. డైరెక్టర్ కరుణ కుమార్ స్పీచ్తో హీరో తిరువీర్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

ఇక ఈ మూవీ డైరెక్టర్ దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ట్రైలర్‌‌‌‌కు వంద రెట్లు అనేట్టుగా సినిమా ఉంటుందని అన్నాడు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నిర్మాత సందీప్ అగరం థ్యాంక్స్ చెప్పారు. మాస్టర్ రోహన్, నటుడు నరేంద్ర, నటి యామిని, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి పాల్గొన్నారు.

తిరువీర్ సినిమాల విషయానికి వస్తే.. చిన్నప్పటినుండి ఆయనకీ నటన అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నాటక రంగంలో అడుగుపెట్టాడు తిరువీర్. ఆ తరువాత కొంతకాలం రేడియో జాకీగా చేసిన ఆయన.. 'బొమ్మలరామారం' అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస 1978, టక్ జగదీష్ వంటి సినిమాలు చేసారు.

ఇలా ఇన్ని సినిమాలు చేసిన పెద్దగా తెలియని తిరువీర్.. 2022లో వచ్చిన మసూద సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హారర్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం తిరువీర్ భగవంతుడుతో పాటు మరో మూడు సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కాగా తిరువీర్ తెలంగాణకి చెందిన హీరో. ఇతనిది రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి గ్రామం.