- పాలమూరు మార్కెట్లో ట్రేడర్ల మాయాజాలం
- కర్నాటక నుంచి భారీగా పంట రావడంతో రేట్లు డౌన్
- రూ.7,400 నుంచి రూ.5 వేలకు తగ్గిన ధర
- రెండురోజులు సెలవు కావడంతో వచ్చినకాడికే అమ్ముతున్న రైతులు
మహబూబ్‌నగర్, వెలుగు: పల్లీ ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. కర్నాటక రైతులు ఎక్కువగా పంటను తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లకు తీసుకొస్తుండటంతో ట్రేడర్లు ధరలు తగ్గించి రైతులను మోసం చేస్తున్నారు. రెండు రోజుల కిందటి వరకు క్వింటాల్పల్లి రూ.7,500 ఉండగా, తాజాగా రూ.5,200కు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం మహబూబ్నగర్జిల్లాలో ఈ యాసంగిలో దాదాపు 21 వేల ఎకరాల్లో రైతులు పల్లీ సాగు చేశారు. ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున 2.1 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. ప్రస్తుతం నారాయణపేట, మహబూబ్నగర్జిల్లాల్లోని దౌల్తాబాద్, మద్దూరు, మక్తల్, మాగనూరు, నారాయణపేట, గండీడ్, మహ్మదాబాద్, హన్వాడ, దేవరకద్ర, మిడ్జిల్, బాలానగర్ మండలాలకు చెందిన రైతులు పాలమూరు మార్కెట్‌యార్డుకు వారం రోజులుగా పల్లీ తీసుకొస్తున్నారు. సోమవారం నుంచి గురువారం వరకు గ్రేడ్‌ను బట్టి క్వింటాల్ ధర రూ.7,200 నుంచి రూ.7,500 వరకు చెల్లించారు. అయితే శుక్రవారం రాత్రి దాదాపు 40 వేల పల్లీ బస్తాలు(మూడు బస్తాలు క్వింటా) కర్నాటక నుంచి వచ్చాయి. దీంతో శనివారం ట్రేడర్లు ఒక్కసారిగా రేటు తగ్గించేశారు.
దిక్కుతోచని స్థితిలో రైతులు
కర్నాటక రైతులు ఇక్కడి మార్కెట్లో కనీసం రూ.7 వేల ధర వస్తుందని ఆశించినా ఆ ధరను ట్రేడర్లు చెల్లించడం లేదు. శనివారం సాయంత్రం ఐదున్నర గంటలవరకు చాలామంది రైతుల పల్లిని కాంటా కూడా చేయలేదు. ట్రేడర్లు ఉదయం వచ్చి కొన్ని కుప్పలకు గ్రేడింగ్ చేసి ధర నిర్ణయించి వెళ్లారు. మిగతా రైతులంతా యార్డులోనే ఉన్నారు. అయితే యార్డుకు ఆదివారం హాలిడే కావడంతో పాటు సోమవారం అమావాస్య ఉండటంతో బంద్ పెట్టనున్నట్లు సమాచారం. దీంతో కర్నాటక నుంచి వచ్చిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రెండు రోజులు మార్కెట్‌కు సెలవులు ఉండటంతో తాము నిర్ణయించిన ధరకే రైతుల నుంచి పల్లీ కొనాలని ట్రేడర్లు ప్లాన్ చేస్తున్నారు.
వంద ఇస్తే బార్డర్ గేట్లు ఓపెన్
శుక్రవారం కర్నాటక నుంచి భారీగా పల్లీలను తెస్తున్నా కర్నాటక బార్డర్ల వద్ద మార్కెటింగ్‌శాఖ ఆఫీసర్లు ఎలాంటి తనిఖీలు చేయడం లేదు. పంటల సీజన్ టైం అయినా బార్డర్‌లోని జలాల్పూర్, అమీన్పూర్, కాన్కుర్తి, సజనాపూర్, కొడంగల్, తాండూరులో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడం లేదు. అక్కడక్కడా పోలీస్చెక్పోస్టులున్నా ఫలితం లేదు. అక్కడి సిబ్బంది డీసీఎంలను ఆపి ఒక్కొక్కరి నుంచి రూ. వంద నుంచి 200 వరకు వసూలు చేసి పంపిస్తున్నట్లు కర్నాటక రైతులు చెబుతున్నారు.
రూ.4,800 రేట్ కట్టిన్రు
మాది ముదెళ్లి. 102 సంచుల పల్లీని శుక్రవారం రాత్రి పాలమూరు మార్కెట్‌కు తెచ్చిన. ఒక్క సంచికి రూ.70 కిరాయి చొప్పున మొత్తం సంచులకు రూ.7,140 ఇచ్చిన. గింజ మంచిగున్నా ట్రేడర్లు క్వింటాల్‌కు రూ.4,800 చొప్పున మాత్రమే రేట్కట్టినరు. డీసీఎం కిరాయి, పంట పెట్టుబడి డబ్బులు కూడా రాలేదు. మా దగ్గర అమ్ముకున్నా కనీసం రూ.5 వేల ధర వచ్చేది.
– సాబన్న, రైతు, ముద్దెళ్లి, కర్నాటక
లోకల్ రైతుల పరిస్థితేంది?
నేను క్వింటాల్ పల్లి విత్తనాలను ఈ సీజన్లో రూ.12,300 పెట్టి కొన్నా. విత్తనాలకు రేటు డిసైడ్ చేస్తున్నరు కానీ, పంటను అమ్మనీకి తీసుకొస్తే ఎందుకు రేట్డిసైడ్చేస్తలేరు. నిరుడు రూ.7,500 నుంచి రూ.9 వేల వరకు ధర ఇచ్చినరు. మూడు రోజుల కిందటి వరకు కూడా రూ.7,500 చెల్లించి, ఇప్పుడు కర్నాటక నుంచి ఎక్కువగా వచ్చిందని ట్రేడర్లు రేట్డౌన్చేసినరు. లోకల్‌గా ఉన్న మా పరిస్థితి ఎంటి. ఇప్పటివరకు కేవలం పావు వంతు పల్లి మాత్రమే మార్కెట్‌కు వచ్చింది. ఇంకా చాలా పంట ఉంది. మరి ఆ రైతుల పరిస్థితి ఏంది?
- కోట్ల యాదయ్య, రైతు, గాధిర్యాల్, గండీడ్ మండలం
