
న్యూఢిల్లీ: పాఠశాలల పాఠ్యపుస్తకాల్లో ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ చేర్చాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) కమిటీ సిఫార్సు చేసింది. సాంఘిక శాస్త్రాల కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ సవరణను సూచించింది. అలాగే, పాఠ్యాంశాల్లో ‘ప్రాచీన చరిత్ర’కి బదులుగా ‘క్లాసికల్ హిస్టరీ’ని ప్రవేశపెట్టాలని, అన్ని సబ్జెక్టులకు సిలబస్లో భారతీయ నాలెడ్జ్ సిస్టమ్ (ఐకేఎస్)ని చేర్చాలని ప్యానెల్ సూచించిందని కమిటీ చైర్మన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ మెంబర్ సీఐ ఐజాక్ తెలిపారు.
పాఠ్యపుస్తకాల్లో వివిధ పోరాటాలలో హిందువుల విజయాలను హైలైట్ చేయా లని కూడా కమిటీ సిఫార్సు చేసిందని ఆయన చెప్పారు. ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లో మన వైఫల్యాలే ప్రస్తావించారని, మొఘలులు, సుల్తానులపై మన విజయాలు ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్యానెల్ సిఫారసులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్‌సీఈఆర్‌టీ అధికారులు తెలిపారు.
జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా పాఠ్యపుస్తకాలను ఎన్‌సీఈఆర్‌టీ సవరిస్తున్నది. పాఠ్యాంశాలు, అభ్యాస సామగ్రిని ఖరారు చేయడానికి కౌన్సిల్ ఇటీవల 19 మంది సభ్యుల నేషనల్ సిలబస్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీ (ఎన్ఎస్టీసీ)ని ఏర్పాటు చేసింది.