బొప్పాయి సాగుతో బొచ్చెడు లాభాలు

బొప్పాయి సాగుతో బొచ్చెడు లాభాలు

పండించిన వాళ్లకు బోలెడు లాభాలు, తిన్నవాళ్లకు బోలెడు పోషకాలు ఇస్తోంది బొప్పాయి. అందుకే దీనికి ఫుల్‌‌ డిమాండ్‌‌ ఉంది. ఆ డిమాండ్‌‌ వల్లే రైతులు బొప్పాయి పండిస్తున్నారు. పెట్టుబడి పోను మూడింతలు సంపాదిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ రైతు నల్లపు వెంకట్రాం నర్సయ్య కొన్నేళ్లుగా ఈ పంట సాగు చేస్తూ లాభాలు పొందుతున్నాడు…

పర్వతగిరి, వెలుగు : ఆ మధ్య చాలా మందికి విషజర్వాలు వచ్చి రక్త కణాల సంఖ్య బాగా తగ్గిపోయింది. అప్పుడు డాక్టర్లు ఎక్కువగా బొప్పాయి తినాలని చెప్పారు. దాంతో ఒక్కసారిగా బొప్పాయి ధరలు ఆకాశాన్నంటాయి. డయాబెటిక్స్​ ఉన్నవాళ్లు కూడా బొప్పాయి తినొచ్చు. అందుకే బొప్పాయి రైతులకు కాసుల పంట పండింది. 16వ శతాబ్దంలో మనకు పరిచయమైన బొప్పాయి.. ఈశాన్య రాష్ట్రాల మీదుగా దక్షిణాది రాష్ట్రాలకు వచ్చింది. మంచి డిమాండ్ ఉండడంతో చాలామంది రైతులు బొప్పాయి పండిస్తున్నారు.

నల్లపు వెంకట్రాం నర్సయ్య గతంలో వరి, పత్తి, మొక్కజొన్న పండించేవాడు. కానీ.. కొన్నేళ్ల క్రితం బొప్పాయి సాగు మొదలుపెట్టాడు. కష్టానికి తగిన ఫలితం వస్తుండడంతో పదేళ్లుగా హైబ్రిడ్ రకం బొప్పాయి ‘రెడ్‌‌ లేడీ 786’ని రెండెకరాల్లో సాగు చేస్తున్నాడు. ఎకరాకు సుమారు 4 లక్షల రూపాయల లాభం వస్తుంది. మంచి డిమాండ్ ఉండడంతో అమ్మకాలకు కూడా పెద్దగా ఇబ్బందులు రావడంలేదు. వ్యాపారులు పంట దగ్గరకే వచ్చి కొనుక్కుంటున్నారు.

సాగుకు అనుకూలమైన వాతావరణం

ఉష్ణ, సమశీతోష్ణ మండలాల రైతులకు ఇది చాలా అనుకూలమైన పంట. పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 40 డిగ్రీలు ఉండాలి. ఉదజని సూచిక 6.5 నుంచి 7.00 మధ్య ఉన్న భూములు బొప్పాయి తోటలకు అనువైనవి. నీరు నిలవని ఎర్ర, గరప నేలలు, తేలికపాటి నల్లరేగడి నేలల్లో పంట బాగా పండుతుంది. లోతట్టు ప్రాంతాల్లోని తోటలు 48 గంటలపాటు ముంపునకు గురైతే వేరు కుళ్లు, తెగుళ్లు సోకుతాయి. అందువల్ల అలాంటి భూములు ఆమ్ల, చౌడు భూములు బొప్పాయి సాగుకు ఏమాత్రం అనువైనవి కావు. రెండేళ్లలో పండే బొప్పాయి మొక్కలను జూన్‌‌, జూలై, అక్టోబర్, -నవంబర్, ఫిబ్రవరి, మార్చి నెలల్లో నాటుకోవచ్చు. 40 నుంచి 50 రోజుల వయసున్న మొక్కలను 1.8 మీటర్ల ఎడంతో సాయంకాలం నాటాలి. రెండు నెలల వయసున్న మొక్కలు నాటితే నాలుగైదు నెలల్లో పూత పూస్తాయి. ఏడో నెల నుంచి కాపుకొస్తాయి. తొమ్మిదో నెలలో కోత కొస్తాయి. తొలికోత మొదలయ్యాక 15 నుంచి 20 రోజులకోసారి 22 నెలల వరకు పంట చేతికొస్తుంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

వెంకట్రాం నర్సయ్య బొప్పాయి సాగులో ఆధునిక పద్ధతులను అనుసరించాడు. ముందుగా పశువుల ఎరువు వేసి, దుక్కి దున్ని.. బోదెలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత డ్రిప్పు పైపులు వేయించి, మొక్కలు నాటాడు. తేమను ఒడిసిపట్టి, కలుపు, చీడలు సోకనీయకుండా మల్చింగ్ షీట్లను పరిచాడు. రెండు నెలలకోసారి ఎకరాకు 1600 గ్రాముల సింగిల్‌‌సూపర్‌‌ పాస్ఫేట్‌‌, 850 గ్రాముల పొటాష్‌‌ చల్లుతున్నాడు. టైంకి డ్రిప్ ద్వారా నీరందిస్తున్నాడు. ఎండాకాలంలో చిన్న మొక్కలకైతే 2 రోజుల కోసారి 8 లీటర్లు, పెద్ద చెట్లకైతే ప్రతిరోజు 20 నుంచి 25 లీటర్ల నీటిని డ్రిప్‌‌ద్వారా అందించాలి. బొప్పాయికి కాండం కుళ్ళు, బూడిద తెగుళ్ళు, మచ్చ తెగులు, ఆకు ముడత, పండు ఈగ, నులిపురుగులు చీడల నివారణలో సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటిస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలనిచ్చే బొప్పాయి భారీ వర్షాలను కూడా తట్టుకుని ఎదుగుతుంది.

బొప్పాయితో ఉపయోగాలు

తక్కువ కేలరీల శక్తి, మంచి పోషకాలున్న బొప్పాయిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీర బరువు, షుగర్ లెవెల్స్, కొవ్వు అదుపులో ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్‌‌–ఎ పుష్కలంగా ఉండటం వల్ల కళ్లకు మంచిది. కీళ్ళ నొప్పులు, అలసట తగ్గుతాయి. బొప్పాయిలోని పపైన్ జీర్ణశక్తిని, ఆడవాళ్లలో రుతుక్రమాన్ని కంట్రోల్​ చేస్తుంది. వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తోంది. జుట్టు ఒత్తుగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది. బొప్పాయిలోని యాంటి ఆక్సిడెంట్స్‌‌, పైటోనూట్రియెంట్స్‌‌, ఫ్లేవనాయిడ్స్‌‌… క్యాన్సర్‌‌‌‌ నుంచి కాపాడుతాయి. మలేరియా, డెంగ్యూ జ్వరాల వల్ల పడిపోయిన ప్లేట్‌‌లెట్స్ కౌంట్‌‌ను పెంచుతుంది.

సాగుతో లాభాలు అందుకుంటున్నా

బొప్పాయి సాగుతో లాభాలు అందుకుంటున్నా. ఇతర పంటలు సాగు చేయడం కంటే ఇది చాలా బెటర్‌‌‌‌. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వ్యాపారులు పొలానికే వచ్చి కొంటున్నారు. రెండెకరాల్లో సాగు చేస్తున్నా. పెట్టుబడికి మూడింతల ఆదాయం వస్తుంది. ఇక ముందు కూడా బొప్పాయినే సాగు చేస్తా.

–నల్లపు వెంకట్రాం నర్సయ్య, రైతు, చింతనెక్కొండ