ఈ విషయంలో పేరెంట్స్ కాస్త జాగ్రత్తగా ఉండాలి..

ఈ విషయంలో పేరెంట్స్ కాస్త జాగ్రత్తగా ఉండాలి..

అడిగింది ఇవ్వకపోయినా, తమకు నచ్చనిది చేసినా.. ఏడ్చి, మారాం చేస్తుంటారు కొందరు పిల్లలు. తినడం మానేస్తుంటారు. దాంతో చేసేదేమీ లేక వాళ్లు అడిగింది ఇచ్చేస్తుంటారు పేరెంట్స్. అయితే పిల్లలకు ఇలా అలవాటు చేయడం మంచిది కాదంటున్నారు. పేరెంట్ ఎడ్యుకేటర్ కెల్లీ హోమ్స్. అలక నేర్చిన పిల్లలను ఎలా డీల్ చేయాలో ఆమె మాటల్లోనే..

చాలామంది పిల్లలు అతి గారాబం వల్లనే అలగడం నేర్చుకుంటారు. ఏది చూస్తే అది కావాలంటారు. ఇవ్వకపోతే మారాం చేస్తుంటారు.  కాదంటే ఏడవడం, అలగడం లాంటివి  చేస్తుంటారు. అయితే పిల్లలు ఏడుస్తున్నారు కదా అని వాళ్లు అడిగిందల్లా ఇవ్వడం అలవాటు చేస్తే.. పిల్లలు అదే పద్ధతిని కంటిన్యూ చేస్తారు. అందుకే ఈ విషయంలో పేరెంట్స్ కాస్త జాగ్రత్తగా ఉండాలి.

  • చిన్న పిల్లలు మారాం చేయగానే అడిగింది ఇచ్చేస్తే.. అలా అలగడం వల్లనే అన్ని పనులు జరుగుతాయని పిల్లలు నమ్ముతారు. ఇది వాళ్ల ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌కు ఇబ్బంది. అందుకే పిల్లలు అలిగినప్పుడు పట్టించుకోకుండా ఎవరి పని వాళ్లు చేసుకోవాలి. అలిగినప్పుడు ‘ఇక చాలు రమ్మని’ పిలవాలి. పిలిచినప్పుడు రాకపోతే ‘మళ్లీ పిలవం’ అని కూడా చెప్పాలి. అలా చేయడం వల్ల అలక ఇంకా ఎక్కువ అవ్వొచ్చు. అయినా సరే అలాగే వదిలెయ్యాలి. వాళ్లను బతిమిలాడకూడదు. అలిగి ఏడుస్తుంటే బుజ్జగించకుండా మౌనంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజులకు వాళ్లలో తప్పక మార్పు వస్తుంది. అలిగినా అటెన్షన్ దొరకదని అర్థమవుతుంది. అప్పుడు ఆ అలవాటుని  నెమ్మదిగా మానేస్తారు.
  •  అలక నేర్చిన పిల్లలు కాస్త పెద్ద వాళ్లయితే మాటల ద్వారా డీల్ చేయొచ్చు.  షాపింగ్‌‌‌‌కు వెళ్లినప్పుడు చూసిందల్లా కొనివ్వమని అడుగుతుంటే అవన్నీ అవసరం కాదని సున్నితంగా చెప్పాలి. వాళ్లు అడిగే వస్తువు ఎందుకు అవసరమైనదో వాళ్లనే అడగాలి. ఇలా చేస్తే పిల్లలు ఆలోచించడం మొదలుపెడతారు. 
  • టీనేజ్‌‌‌‌లో ఉన్న పిల్లల్లో కూడా మొండి ప్రవర్తన కనిపిస్తుంటుంది. వీళ్లను మరోలా డీల్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది పిల్లలు వయసుకి మించి ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌ లేదా ఐఫోన్‌‌‌‌ వంటివి అడుగు తుంటారు. అలాంటప్పుడు పేరెంట్స్ కచ్చితంగా కుదరదని చెప్పేయాలి. ఇంకొంతమంది పిల్లలు తమ ఫ్రెండ్స్ ఇళ్లలో ఉన్న వస్తువులు తమ ఇంట్లో కూడా ఉండాలని అడుగుతారు.
  • ఇలాంటప్పుడు కూడా తల్లిదండ్రులు ‘నో’ చెప్పాలి. ఒకరితో పోల్చుకోవడం మంచిది కాదని చెప్పాలి. అంతగా పట్టు బట్టి అడిగితే.. వాళ్లకు ఏదైనా టాస్క్ ఇవ్వాలి. ఫలానా విషయం నేర్చుకుంటే కొనిస్తానని చెప్పాలి. దీనివల్ల టీనేజ్ పిల్లలను కొత్త విషయాలవైపు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది.
  • పిల్లలు అలిగినప్పుడు బతిమాలడం ద్వారా వాళ్లు మొండిగా మారే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా వాళ్లు కోరుకున్నది దక్కకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్లు డిప్రెషన్‌‌‌‌ లోకి వెళ్లే ప్రమాదముంది. అందుకే పిల్లల అలిగే అలవాటుని కచ్చితంగా మాన్పించాల్సిందే.
  • కొంతమంది పిల్లలు వాళ్లు చేసిన తప్పుకి భయపడి లేదా వాళ్లకు నచ్చని విషయాన్ని నేరుగా చెప్పలేక భయంతో అలక ప్రదర్శిస్తుంటారు. అలాగే కొన్నిసార్లు పిల్లల మనసు నొచ్చుకున్నప్పుడు దాన్ని చెప్పలేక అలుగుతుంటారు. ఇలాంటి సిచ్యుయేషన్స్‌‌లో పేరెంట్స్ సున్నితంగా మాట్లాడి విషయం తెలుసుకోవాలి.  వాళ్ల భయాన్ని పోగొట్టాలి.