పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లాను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా) పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకోవడంపై పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం పరిగిలో ఆయన ఇంట్లో మాట్లాడారు. వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 493 గ్రామ పంచాయతీలను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకురావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అర్బన్ డెవలప్మెంట్ కింద ప్రత్యేక ప్రణాళికలతో మున్సిపాలిటీలను గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే వుడా పని అని తెలిపారు. వికారాబాద్ జిల్లాను వుడాలో కలపడం ద్వారా, తాగునీటితో పాటు మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందన్నారు. పరిశ్రమలు ఏర్పాటు జరిగి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.