
ఇండియా స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాకు మద్దతిచ్చేందుకు కేరళ సైక్లిస్ట్ సాహసం చేశాడు. కాలికట్‌కు చెందిన ఫాయిస్ అస్రఫ్ అలీ.. రెండేండ్ల కిందట (15 ఆగస్టు 2022) కాలికట్ నుంచి ఒలింపిక్స్ కోసం పారిస్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో 30 దేశాలు దాటుకుంటూ 22 వేల కిలో మీటర్లు ప్రయాణించి పారిస్ చేరుకున్నాడు. నాలుగు జతల బట్టలు, ఒక టెంట్, స్లీపింగ్ బ్యాగ్, సైకిల్.. మొత్తం కలిపి 50 కేజీల బరువు ఉండేలా చూసుకున్నాడు. సౌధీలో ప్రొఫెషనల్ ఇంజనీర్‌గా పని చేసిన అలీ.. 2018 తండ్రి మరణించడంతో ఇండియాకు తిరిగొచ్చాడు. అయితే థైరాయిడ్ సమస్య వల్ల బరువు విపరీతంగా పెరిగిపోవడంతో సైక్లింగ్ వైపు మొగ్గాడు. 13 వేలకు సైకిల్ కొని తొలి రైడ్ కాలికట్ నుంచి సింగపూర్ వెళ్లాడు. పారిస్ కోసం రెండున్నర లక్షలు పెట్టి అధునాతన సైకిల్ కొన్నాడు. స్పాన్సర్లు, ఇతరుల సాయంతో అతను ఈ టూర్లు చేస్తుంటాడు.
ఐదు దేశాలు మారి.. శరణార్థిగా బరిలోకి
అధునాతన సౌకర్యాలు, అద్భుతమైన కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్న అథ్లెట్లు కూడా ఒక్కోసారి ఒలింపిక్స్‌లో ఆడలేకపోతారు. కానీ అఫ్గానిస్తాన్‌కు చెందిన జూడోకా సిబ్గతుల్లా అరబ్ ఒలింపిక్స్ కలను నెరవేర్చుకునేందుకు 6 వేల కిలో మీటర్లు ప్రయాణించడంతో పాటు ఐదు దేశాలు మారాడు. చివరకు శరణార్థి జట్టులో చోటు సంపాదించి మెగా గేమ్స్‌లో బరిలోకి దిగాడు. 2021లో తాలిబన్ నుంచి పారిపోయిన అరబ్.. జర్మనీలో స్థిరపడటానికి ముందు ఇరాన్, టర్కీ, గ్రీస్, బోస్నియా, స్లోవేనియాలో తలదాచుకున్నాడు. 19 ఏండ్ల వయసులో అఫ్గాన్ జూడో టీమ్‌లో చోటు సంపాదించినా.. తాలిబన్లు అధికారంలోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి. దాంతో అఫ్గాన్ నుంచి బయటపడి జర్మనీ చేరాడు. అక్కడి అధికారులకు పట్టుబడటంతో డార్ట్‌మండ్‌కు తూర్పున ఉన్న కామెన్ అనే చిన్న పట్నంలో ఏర్పాటు చేసిన శరణార్థుల కేంద్రంలో అతన్ని ఉంచారు. అదే అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. జూడోలో మంచి నైపుణ్యాన్ని సాధించడంతో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. ప్రస్తుతం మెన్స్ 81 కేజీల్లో అతను బరిలోకి దిగుతున్నాడు.