VIDEO: 20వేల అడుగుల ఎత్తున విమానంలో పొగలు.. పక్షి చేసిన పనితో ప్యాసింజర్లు హడల్..!

VIDEO: 20వేల అడుగుల ఎత్తున విమానంలో పొగలు.. పక్షి చేసిన పనితో ప్యాసింజర్లు హడల్..!

గడచిన మూడు నెలలుగా విమాన ప్రమాదాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. కొన్నింటిలో ప్రయాణికుల ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. చాలా వాటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి విమానాలు. తాజాగా అలాంటి ఘటన 20వేల అడుగుల ఎత్తులో చోటుచేసుకోవటం ప్యాసింజర్లను గుండె ఆగేంతలా ఆందోళనకు గురిచేసింది. 

మ్యాడ్రిడ్ నుంచి ప్యారిస్ ప్రయాణిస్తున్న ఐబీరియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక పక్షి కారణంగా ప్రమాదానికి గురైంది. పక్షి విమానం ముక్కు భాగాన్ని డ్యామేజ్ చేయటంతో దానిని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పక్షి ఢీకొట్టడం కారణంగా విమానం ముందు భాగం పెళ్లున విరిగిపోయింది. దీంతో విమానం క్యాబిన్ రూం మెుత్తం పొగతో నిండిపోయింది. ప్యాసింజర్లు వెంటనే ఆక్సిజన్ మాస్క్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కేవలం టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే ఫ్లైట్ 20వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఆ సమయంలోనే అకస్మాత్తుగా పక్షి విమానం ముందు భాగాన్ని ఢీకొట్టిందని తేలింది. విమానంలో పైలట్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారని.. తాము ఏదో అనుకోని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు గ్రహించినట్లు ఒక ప్రయాణికుడు చెప్పాడు. అయితే చివరికి విమానం మాడ్రిడ్ లో సురక్షితంగా ల్యాండ్ కావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పైలట్లు, క్యాబిన్ సిబ్బంది పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించటంతో పెద్ద ప్రమాదం తప్పింది. తాజా ప్రమాదంలో పక్షి ఇంజన్లలో ఒకదానికి నష్టం కలిగించటంతో క్యాబిన్ లోకి పొగ వచ్చిందని అధికారులు గుర్తించారు. 

►ALSO READ | వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉంటే కఠిన చర్యలు