కోదండరామ్ కు కాంగ్రెస్ గాలం

కోదండరామ్ కు కాంగ్రెస్ గాలం

కోదండరామ్ కు కాంగ్రెస్ గాలం
పార్టీలోకి రావాలంటున్న ఏఐసీసీ పెద్దలు
టీజేఎస్ విలీనానికి హస్తం పార్టీ ప్రతిపాదన
ఏఐసీసీ లేదా పీసీసీ లో కీలక పోస్ట్ ఆఫర్
కేసీఆర్ ను ఓడించడమే టార్గెట్ గా పావులు

హైదరాబాద్ : టీజెఎస్ అధినేత, తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్ కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోంది. తమ పార్టీలో చేరాలని ఏఐసీసీ పెద్దలు రాయబారం పంపుతున్నారు. ఏఐసీసీ లేదా పీసీసీ లో కీలక పదవిని ఆయనకు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. టీజేఎస్ ను విలీనం చేయాలనే ప్రతిపాదనను కోదండరాం ముందుంచినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన కోదండరాం తమ పార్టీలో చేరితే బాగా కలిసి వస్తుందని కాంగ్రెస్ పెద్దలు విశ్వసిస్తున్నారు.

ఏఐసీసీ పెద్దల సూచన మేరకు ఇవాళ జూపల్లి నివాసంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కోదండరామ్ తో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. జూపల్లిని పార్టీలోకి ఆహ్వానించేందుకే తాను వచ్చానని సంపత్ కుమార్ చెబుతున్నారు. అయితే కేసీఆర్ ను ఓడించేందుకు రాజకీయ పునరేకీకరణ జరగాలని కాంగ్రెస్ భావిస్తున్న తరుణంలో జరిగిన ఈ భేటీకి ప్రయారిటీ ఏర్పడింది. సుమారు రెండు గంటల పాటు జరిగిన చర్చల్లో జూపల్లి అభ్యంతరాలకు క్లారిటీ ఇచ్చినట్టు సంపత్ కుమార్ చెబుతున్నారు.

ఏఐసీసీ,పీసీసీ ఆదేశాలతోనే తాను చర్చలు జరిపినట్టు సంపత్ చెబుతున్నారు. కోదండరాంతోనూ రాజకీయ పునరేకీకరణపై చర్చ జరిగింది. పార్టీ విలీనం, కలిసి పనిచేయడం లాంటి అంశాలపైనా డిస్కస్ చేశామని సంపత్ తెలిపారు. గత ఎన్నికల్లో జరిగిన లోపాలను కోదండరాం పాయింటవుట్ చేశారని, వాటికి తాను క్లారిటీ ఇచ్చానంటున్నారు. ఇకపై అలా జరగకుండా చూస్తానని చెబుతూనే రేవంత్ ఆలోచనా విధానాన్ని కోదండరాంకు వివరించానంటున్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని, బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యం కావాలని కోదండరాం చెప్పినట్టు తెలుస్తోంది. 

పునరేకీకరణ దిశగా ప్రొఫెసర్ అడుగులు

బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ దిశగా కోదండరాం అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేంగా జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ పాల్గొంటూ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఎండగడుతున్నారు. ఇదే తరుణంలో జూపల్లితో నివాసంలో సంపత్ కుమార్ తో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో కోదండరాం కాంగ్రెస్ లో చేరతారా..? ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా..? ఆయన నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.