దేవుడి పేరుతో ..పాస్​ బుక్కులు జారీ చేస్తం

దేవుడి పేరుతో ..పాస్​ బుక్కులు జారీ చేస్తం

వేములవాడ, వెలుగు :  గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖలో అవినీతి అక్రమాలు జరిగాయని,  దేవుడి భూములు కబ్జాకు గురయ్యాయని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. దేవాదాయ భూములపై త్వరలో  ఎంక్వెరీ చేసి, వాటిని కాపాడేందుకు దేవుడి పేరుతో పాస్​బుక్కులు జారీ చేస్తామని వెల్లడించారు. సోమవారం ఆమె వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె  మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కబ్జాకు గురైన దేవాలయ భూములపై పూర్తిస్థాయి ఎంక్వైరీ చేసి వివరాలు బయటకు తీస్తామన్నారు. ఆలయాల అభివృద్ధికి దేశ, విదేశాల నుంచి విరాళాలు సేకరించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందిస్తామని చెప్పారు. బాసర, వేములవాడ ఆలయాల్లో పలు ఫిర్యాదులపై విచారణకు ఆదేశించామన్నారు.  తన మనవడి పుట్టెంట్రుకలు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. వారి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేశ్‌, పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్,  లీడర్లు రాకేశ్‌, పుల్కం రాజు, కొమురయ్య, రమేశ్‌, అజయ్, శ్రీనివాస్, సత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.