
చిట్యాల, వెలుగు : ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని పతంజలి పామాయిల్ కంపెనీ సీనియర్ మేనేజర్ నర్రా రవీందర్ రెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలోని ఆయిల్ పామ్ తోటలో మొదటి గెలల కోత, నాణ్యతా ప్రమాణాలపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే దీర్ఘకాలంపాటు మంచి దిగుబడి వస్తుందన్నారు. ఉద్యానశాఖ ద్వారా తోటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉద్యానశాఖ అధికారి శ్వేత సూచించారు. కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, పతంజలి కంపెనీ ఆఫీసర్ నరేందర్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగుతో నెలసరి ఆదాయం
మోతే (మునగాల), వెలుగు : వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేసి నెలసరి ఆదాయం పొందాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య, పతంజలి ఆయిల్ కంపెనీ డీజీఎం బి.యాదగిరి రైతులకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో ఆయిల్ పామ్ సాగుచేస్తున్న దామిడి గోపాల్ రెడ్డి వ్యవసాయక్షేత్రంలో మెగా ప్లాంటేషన్ లో భాగంగా మొక్కలు నాటారు.