ఏటూరునాగారం, వెలుగు : మహాజాతర ప్రారంభానికి ముందు వచ్చే గురువారం మేడారంలోని సమ్మక్క, సారలమ్మలకు చందా వంశీయులు ఒడి బియ్యం, పట్టుచీరలు సమర్పించడం ఆనవాయితీ. సమ్మక్క పుట్టిన రోజు, పెండ్లిరోజు గురువారమే కావడంతో ఆదివాసీలు గురువారాన్ని సమ్మక్క రోజుగా పరిగణిస్తారు. ఇందులో భాగంగా గురువారం సమ్మక్క స్వగ్రామమైన బయ్యక్కపేటలోని సమ్మక్క గుడిలో చందా వంశీయులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజలు చేశారు. ఒక్క చోటికి చేరిన అన్నాదమ్ములకు, అక్కాచెల్లెండ్లు కంకణాలు కట్టి ఆశీర్వదించారు. తర్వాత బయ్యక్కపేట నుంచి ఒడిబియ్యం, పట్టుచీరె, సారెలను మేడారం గద్దెల వద్దకు తీసుకు వచ్చి అమ్మవార్లకు సమర్పించారు. అక్కడే ఆడపడుచులు, వారి కుటుంబసభ్యులకు బట్టలు పెట్టారు.
