
- ఈ నెల 6 వరకు కొనసాగనున్న ఉత్సవాలు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంతో పాటు అనుబంధ ఆలయమైన పాతగుట్టలో సోమవారం పవిత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. స్వస్తివాచనం, పుణ్యాహవచనం, అంకురారోపణ పూజలతో పవిత్రోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. సోమవారం మొదలైన ఈ ఉత్సవాలు ఈ నెల 6 వరకు కొనసాగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా మంగళ, బుధవారం స్వామి వారి ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమాలు, బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేశారు.
పవిత్రోత్సవాల అనంతరం ఈ నెల 7 నుంచి ఆర్జిత సేవలను పునరుద్ధరించనున్నారు. ఆలయ పవిత్రతను కాపాడడం, ఏడాది పాటు ఆలయంలో జరిగిన పూజల్లో తెలిసీ తెలియక ఏమైనా తప్పులు జరిగి ఉంటే వాటిని తొలగించడం కోసం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు తెలిపారు.