
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో మద్యం సరఫరాదారులకు తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చెల్లించాల్సిన బకాయిలు రూ.3,151 కోట్లు తక్షణమే ఇవ్వాలని ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీస్ డిమాండ్ చేశాయి. ఈ బకాయిల్లో రూ.2,300 కోట్లకు పైగా ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. చెల్లింపులు ఆలస్యం కావడంతో సరఫరా సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నాయి.
ఈ నెల చివర్లో జరగనున్న రిటైల్ లైసెన్స్ పునరుద్ధరణ టెండర్ ద్వారా రాష్ట్రానికి వచ్చే సుమారు రూ.3,000 కోట్ల ఆదాయాన్ని ఈ బకాయిలు చెల్లించడానికి వినియోగించాలని కోరాయి. తాత్కాలికంగా అడ్వాన్స్ ఎక్సైజ్ డ్యూటీని 30 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశాయి. 2023–-24 ఆర్థిక సంవత్సరంలో ఆల్కహాల్ అమ్మకాల ద్వారా రాష్ట్రానికి రూ.38,000 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇది రాష్ట్ర మొత్తం ఆదాయంలో 32 శాతం వాటాకు సమానమని పేర్కొన్నాయి.