రూ.కోటి మూట విప్పేదెప్పుడు.. దేనికి ఖర్చు చేయాలనేది తేల్చని సర్కారు

రూ.కోటి మూట విప్పేదెప్పుడు.. దేనికి ఖర్చు చేయాలనేది తేల్చని సర్కారు
  •     భద్రాద్రిలో ఆగిపోయిన బిల్లుల చెల్లింపులు
  •     ఉత్తర్వులకే పరిమితమైన నిధులు
  •     ఎదురుచూస్తున్న వివిధ శాఖలు

భద్రాచలం, వెలుగు: దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ సర్కారు రూ.కోటి నిధులు మంజూరు చేసింది. కానీ అవి దేవస్థానంకు ఇస్తారా..? లేక ఏర్పాట్ల కోసం పెట్టిన ఖర్చుల బిల్లులకు చెల్లిస్తారా..? అనేది ఇప్పటికీ తేల్చలేదు. దీనిపై సరైన స్పష్టత రాలేదు. ఫలితంగా బ్రహ్మోత్సవాలకు వివిధ శాఖల అధికారులు ఖర్చు పెట్టి బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు. రూ.కోటి మూట విప్పేదెప్పుడు..? బిల్లులు చెల్లించేదెప్పుడు..? అంటూ ఆఫీసర్లు పెదవివిరుస్తున్నారు. సర్కారు కేవలం ఉత్తర్వులు మాత్రమే ఇచ్చింది. కానీ పైసలు మాత్రం రిలీజ్ చేయకపోవడం కొసమెరుపు.

 ఖర్చులు మాత్రం బారెడు...

బ్రహ్మోత్సవాలకు శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం దాదాపు రూ.1.50కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వ ఉత్సవాలుగా ముక్కోటి, శ్రీరామనవమి వేడుకలను ప్రకటించి సర్కారే నిర్వహణకు నిధులు మంజూరు చేయాలని కొంత కాలంగా భక్తులు డిమాండ్​చేస్తున్నారు. రెండు మూడేళ్లుగా కరోనా వంటి ప్రతికూల పరిస్థితులతో ఆదాయం తగ్గింది. దీంతో ఉత్సవాల నిర్వహణ భారంగా మారింది. ‘ఖర్చులు చూస్తే బారెడు.. నిధులు చూస్తే మూరెడు’ అన్నట్లుగా తయారైంది. ఒక్క దేవస్థానమే కాకుండా మిగిలిన శాఖలు కూడా ఉత్సవాలకు ఖర్చు చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఈ ఏడాది వైద్యారోగ్యశాఖ 20కు పైగా వైద్యశిబిరాలు, మందులు, టెంట్లు, తాగునీరు, బ్యానర్లు, రవాణా ఖర్చులు, అంబులెన్సులు, ప్రత్యేక ఏర్పాట్లకు సుమారు రూ.1.36 లక్షలు ఖర్చు చేసింది. ఆ బిల్లులు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రాలేదు. పోయిన ఏడాది రూ.1.87లక్షలు ఖర్చు పెడితే రూ.లక్ష మాత్రమే ఇచ్చారు. మిషన్​భగీరథ తరఫున భక్తులకు తాత్కాలిక మరుగుదొడ్లు165 వరకు నిర్మించారు. వీటితోపాటు వాటర్, మజ్జిగ ప్యాకెట్లు కొనుగోలు చేసి పంపిణీ చేశారు. ఉత్సవాల కోసం ప్రత్యేకంగా మంచినీటి నల్లాలు 200 వరకు  ఏర్పాటు చేశారు. ఇందుకు సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేశారు. గత వైకుంఠ ఏకాదశీ బిల్లులు కూడా ఆ శాఖకు రాలేదని సంబంధిత ఆఫీసర్లు తెలిపారు. వీటిన్నింటికీ ఇప్పటి వరకు పైసా విడుదల చేయలేదు. వీటితోపాటు చాలా శాఖలకు బిల్లులు ఇలా చెల్లించాల్సి ఉంది. దాదాపు రూ.60 లక్షల బిల్లులు వివిధ శాఖలకు ఇవ్వాల్సి ఉంది. 

బిల్లుల సమస్య పరిష్కారమయ్యేనా?

ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.కోటి ఇంకెప్పుడు ఇస్తారు..? అని బ్రహ్మోత్సవాలకు ఖర్చు పెట్టిన శాఖలతోపాటు భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఓవైపు శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఖర్చుల కోసం రెవెన్యూశాఖకు రూ.10లక్షలు ఏటా ఇస్తోంది. వివిధ శాఖలు చేసిన ఖర్చులకు వీటిని చెల్లిస్తారు. కానీ ఇంకా కొన్ని శాఖలకు బిల్లులే సర్దుబాటు కాలేదు. ఖర్చు ఎక్కువగా ఉంటుందనే కారణంతోనే అన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.కోటి మూట విప్పితే తప్పా మిగిలిన బిల్లుల సమస్య పరిష్కారం అవుతుందని వివిధ శాఖల సిబ్బంది అంటున్నారు. అయితే ఏటా శ్రీరామనవమి సీతారాముల కల్యాణం కోసం తానీషా శాసనం ప్రకారం సర్కారు రూ.15వేలు ఇస్తూ ఉత్తర్వులు ఇస్తుంది. రూ.10వేలు పట్టువస్త్రాలకు, రూ.5వేలు ముత్యాల తలంబ్రాల కోసం అని అందులో పేర్కొంటారు. అయితే అవి పేపర్​కే పరిమితమవుతున్నాయి. పైసలు మాత్రం సర్కారు ఖజానా నుంచి రావడంలేదు. ఇప్పుడు సర్కారు ప్రకటించిన రూ.కోటి శ్రీరామనవమి నిర్వహణ ఖర్చుల ఉత్తర్వులు కూడా అంతేనా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.