అరబిందో ఫార్మాలో పీసీబీ తనిఖీలు.. పరిశ్రమ నీటి శాంపిల్స్ తీసుకున్న ఆఫీసర్ల టీమ్

అరబిందో ఫార్మాలో పీసీబీ తనిఖీలు.. పరిశ్రమ నీటి శాంపిల్స్ తీసుకున్న ఆఫీసర్ల టీమ్

జడ్చర్ల వెలుగు: అరబిందో ఫార్మాపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన కామెంట్స్‎కు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు( పీసీబీ) ఆఫీసర్లు స్పందించారు. శనివారం మహబూబ్ నగర్ పోలేపల్లి సెజ్‎లోని అరబిందో ఫార్మా కంపెనీలో తనిఖీలు నిర్వహిచారు. పీసీబీ జేసీ నరేందర్ ఆధ్వర్యంలో ఈఈ సురేశ్ బాబు, జేఈ కృపానందం, యాదయ్య బృందం వెళ్లి తనిఖీలు చేసి, కంపెనీ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

అనంతరం వాటర్ శాంపిల్స్ తీసుకుంది. దీనిపై నివేదికను మెంబర్ సెక్రటరీకి అందిస్తామని  తనిఖీల అనంతరం అధికారులు మీడియాకు తెలిపారు. డంపింగ్ యార్డ్‎ను పరిశీలించామని, కంపెనీ యాజమాన్యానికి పలు సూచనలు చేసినట్లు చెప్పారు. పరిశ్రమ నుంచి బయటకు వదులుతు న్న కాలుష్యపు నీటికి ప్రత్యమ్నాయ చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించినట్టు పీసీబీ ఆఫీసర్లు వివరించారు. 

పీసీబీ అధికారుల్లో జాయింట్ చీఫ్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్, పీసీబీ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్, పీసీబీ ఏఇ, జీఎం ఇండస్ట్రీస్ తదితర అధికారులు ఉన్నారు.కంపెనీ కెమికల్ వాటర్ ను పంట పొలాల్లోకి వదులుతుండడంతో తీవ్రంగా పంట నష్టపోతున్నామని, పదేండ్లుగా పీసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించి అరబిందో ఫార్మాపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  
నివేదిక వచ్చాక.. ఏం చేయాలో నిర్ణయిస్తా.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అరబిందో ఫార్మా కంపెనీలో కలుషిత జలాల విషయంలో తనిఖీలు చేసిన పీసీబీ ఆఫీసర్ల నివేదిక కోసం ఎదురు చూస్తానని, ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆఫీసర్లు తనిఖీల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా ఇలాంటి తనిఖీలు జరిగాయని, వాటివల్ల ఒరిగిందేమీ లేదని విమర్శించారు.

ఇప్పుడు కూడా ఆఫీసర్లు ఇచ్చే నివేదికలో వాస్తవాలు లేకపోతే తాను అన్నంత పని చేస్తానని హెచ్చరించారు. ఆదివారం చేపట్టాల్సిన తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నానని చెప్పారు. పీసీబీ అధికారులు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాయితీగా తమ నివేదికను ఇవ్వాలని కోరారు.