బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న బీజేపీ : మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న బీజేపీ : మంత్రి పొన్నం ప్రభాకర్
  • పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​ గౌడ్​, మంత్రి పొన్నం ప్రభాకర్

యాదాద్రి, వెలుగు : బీసీ రిజర్వేషన్లు అమలుకాకుండా బీజేపీ అడ్డుకుంటోందని పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​ గౌడ్​, మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి​ మీనాక్షి నటరాజన్​తో కలిసి పీసీసీ చీఫ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ప్రత్యేక రైలులో ఢిల్లీ బయల్దేరారు. ఆలేరు రైల్వే స్టేషన్​లో పీసీసీ చీఫ్ సహా మంత్రులు దిగారు. అనంతరం ఆలేరు, భువనగిరిలో వేర్వేరుగా వారు మీడియాతో మాట్లాడారు. బీసీల గొంతుకగా రాహుల్​గాంధీ పని చేస్తున్నారని తెలిపారు. 

ఆయన ఆదేశాలతోనే తెలంగాణలో కులగణన నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు. బీసీల కోసం 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయినప్పటికీ.. ముస్లింలను సాకుగా చూపిస్తూ బీజేపీ రిజర్వేషన్లను అడ్డుకుంటోందని ఆరోపించారు. తెలంగాణలోని బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులకు బీసీలపై ఏ మాత్రం ప్రేమ లేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు అందరూ మద్దతు తెలపాలని కోరారు. వారి వెంట ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉన్నారు.