
హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సోమవారం గాంధీ భవన్ వెళ్లారు. ఆయనను అభినందించేందుకు వివిధ జిల్లాల నుంచి పార్టీ లీడర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో గాంధీ భవన్ మొత్తం కిక్కిరిసిపోయింది. వందల మంది నేతలు బొకేలు, శాలువాలతో వచ్చి మహేశ్ కుమార్ను సన్మానించారు. తెలంగాణకు నాలుగో పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన ఆయన.. పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు.
త్వరలో పీసీసీ కార్యవర్గ నియామకాలు జరగనున్నందున పదవులు ఆశిస్తున్న జిల్లాల లీడర్లంతా ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. మరో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్ ప్రకటించారు. టికెట్లు ఆశిస్తున్న వారు కూడా మహేశ్ కుమార్ గౌడ్ ను ప్రత్యేకంగా కలిశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా పార్టీ టికెట్ పై గెలిస్తే.. ఎంపీపీ, జడ్పీ చైర్మన్ కావొచ్చనే ఆశలో చాలా మంది నేతలు ఉన్నారు.