బీసీ రిజర్వేషన్లపై నలుగురు మంత్రులతో కమిటీ

బీసీ రిజర్వేషన్లపై నలుగురు మంత్రులతో కమిటీ
  • న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపుల కోసం ఏర్పాటు
  • ఈ నెల 26లోగా నివేదిక ఇవ్వాలని గడువు.. పీసీసీ పీఏసీ మీటింగ్​లో నిర్ణయం
  • కమిటీలో భట్టి, ఉత్తమ్​, శ్రీధర్ బాబు,
  • పొన్నం, సీతక్కకు చోటు
  • గాంధీభవన్​లో సమావేశమైన పీఏసీ 
  • హాజరైన సీఎం రేవంత్​, పీసీసీ చీఫ్​ మహేశ్​, మంత్రులు, నేతలు
  • బీసీ రిజర్వేషన్లు, జూబ్లీహిల్స్​ 
  • బైపోల్​ సహా పలు అంశాలపై చర్చ
  • రాహుల్​ యాత్రకు మద్దతుగా ఈ నెల 26న బిహార్​కు సీఎం, మంత్రులు
  • సమావేశం వివరాలను మీడియాకు 
  • వెల్లడించిన భట్టి, ఉత్తమ్​


హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయ సలహా కోసం మంత్రులతో కమిటీని నియమించాలని పీసీసీ పీఏసీ సమావేశంలో నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్​తో చర్చించి కమిటీని పీసీసీ చీఫ్​ మహేశ్  గౌడ్ ప్రకటించారు. మంత్రుల కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క ఉన్నారు. 

దేశంలోని నిష్ణాతులైన న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరిపి.. ఈ నెల 26లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు, పంచాయతీ రాజ్​ చట్ట సవరణ ఆర్డినెన్స్​ కేంద్రం వద్ద పెండింగ్​లో ఉండడంతో రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలో కమిటీ సంప్రదింపులు జరుపనుంది. 

శనివారం గాంధీభవన్ లో మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్  గౌడ్, మంత్రులు, పలువురు నేతలు పాల్గొన్నారు. బీసీ బిల్లులు, ఆర్డినెన్స్​ రాష్ట్రపతి దగ్గర పెండింగ్​లో ఉండటంపై.. జూబ్లీహిల్స్​ బైపోల్​లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించారు. 

సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మీటింగ్ వివరాలను మీడియాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు. 

ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో సంప్రదింపుల కోసం మంత్రుల కమిటీని నియమించి, ఈ నెల 26 లోపు వారి నుంచి నివేదిక తెప్పించుకోవాలని పీఏసీ నిర్ణయించిందని భట్టి వెల్లడించారు. బీసీలకు న్యాయం జరగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.   

కావాలని కేంద్రం ఆలస్యం చేస్తున్నది

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన సర్వే నిర్వహించి, దాని ద్వారా  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి రెండు బిల్లులు పాస్ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తుచేశారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఒక బిల్లు.. విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ ను కల్పిస్తూ మరో బిల్లును అసెంబ్లీలో ఆమోదింప చేశామని తెలిపారు. 

లోకల్ బాడీ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం  దాటకూడదంటూ కేసీఆర్ తీసుకొచ్చిన పంచాయతీ రాజ్​ –2018 చట్టంలోని నిబంధనను తొలగించేందుకు ఆర్డినెన్స్ కూడా తీసుకువచ్చామని చెప్పారు. బీసీల రిజర్వేషన్ బిల్లులు గవర్నర్ నుంచి రాష్ట్రపతి వద్దకు వెళ్లాయని.. కేంద్రం కావాలని వాటిని ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు.  

జస్టిస్​ సుదర్శన్​రెడ్డి విజయానికి సహకరించాలి

ప్రగతిశీల భావాలు కలిగిన ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు, ఓటు హక్కు కలిగిన ప్రజాప్రతినిధులు సహకరించాలని పీఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క చెప్పారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తెలుగు వ్యక్తి అని, గొప్ప వ్యక్తిని ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలో దించడంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ మీటింగ్ లో హర్షం వ్యక్తం చేసిందన్నారు. 

జస్టిస్​ సుదర్శన్ రెడ్డి హైకోర్టు జడ్జిగా, అస్సాం చీఫ్ జస్టిస్ గా, సుప్రీంకోర్టు జడ్జిగా ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని కాపాడేలా తీర్పులు వెలువరించారని, దేశ ప్రజల హక్కులు కాపాడేందుకు ఆయన చరిత్రాత్మక తీర్పులు వెలువరించారని, అలాంటి న్యాయ నిపుణుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని భట్టి పేర్కొన్నారు.


రాహుల్​ యాత్రకు మద్దతుగా  26న బిహార్​కు సీఎం, మంత్రులు

ఓట్ చోరీకి వ్యతిరేకంగా బిహార్ లో  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా ఈ నెల 26న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్​  సహచరులు, పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేతలు బీహార్ కు వెళ్లాలని పీఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి మాట్లాడుతూ..బీసీ రిజర్వేషన్  అమలు కోసం అభిషేక్ మను సింఘ్వీ, జస్టిస్ సుదర్శన్ రెడ్డి సలహాలు తీసుకుంటామని చెప్పారు.  

కాగా,  సీపీఐ అగ్రనేత  సురవరం సుధాకర్ రెడ్డి మృతికి పీఏసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని తీర్మానం చేసింది. ఆదివారం ఉదయం మక్దూం భవన్​లో సుధాకర్ రెడ్డి పార్దివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కేబినెట్ సహచరులు నివాళులు అర్పించనున్నారు.