సీఎంఆర్ బియ్యం ఇవ్వకుంటే పీడీ యాక్ట్

సీఎంఆర్  బియ్యం ఇవ్వకుంటే పీడీ యాక్ట్
  •     మిల్లర్లకు  కలెక్టర్​ వార్నింగ్

నాగర్​కర్నూల్, వెలుగు: ఎఫ్​సీఐకి సకాలంలో సీఎంఆర్​ బియ్యం ఇవ్వని మిల్లులపై పీడీ యాక్ట్​ బుక్​ చేయాలని కలెక్టర్​ ఉదయ్​కుమార్​ ఆదేశించారు. సీజన్ల వారీగా తీసుకున్న వడ్లకు సీఎంఆర్​ బియ్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన మిల్లులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి రివ్యూ అనంతరం అధికారులు, మిల్లర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు.​ 

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లడుతూ ప్రభుత్వం సేకరించిన వడ్లు తీసుకున్న రైస్​ మిల్లర్లు సకాలంలో సీఎంఆర్​ అప్పగించకుండా జాప్యం చేస్తున్నారని మిల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్​ సప్లై, రెవెన్యూ, మార్కెటింగ్  శాఖల అధికారులు రైస్ మిల్లులను తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన వడ్ల నిల్వలో ఏ మాత్రం తేడా వచ్చినా మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

కల్వకుర్తిలోని  శ్రీ లక్ష్మీవెంకటనరసింహస్వామి పార్​ బాయిల్డ్​ రైస్ మిల్  ఇప్పటివరకు ఒక ఏసీకే కూడా బియ్యం ఇవ్వలేదని, మిల్లర్​పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. గుడిపల్లిలోని సీతారామాంజనేయ ఇండస్ట్రీస్​ 162 ఏసీకేల సీఎంఆర్​ పెండింగ్  ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే మిల్లులో 50 శాతం పెండింగ్  ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలోని 10  రైస్  మిల్లుల వద్ద 324 ఏసీకేల సీఎంఆర్​ బియ్యం పెండింగ్​ ఉండడమేమిటని ప్రశ్నించారు. 

పెండింగ్​లో ఉన్న మిల్లుల నుంచి ఇతర మిల్లులకు వడ్లను బదలాయించాలని ఆదేశించారు. 15 రోజుల్లో వంద శాతం సీఎంఆర్​ బియ్యం అందజేస్తామని మిల్లర్లు తెలిపారు. అడిషనల్​ కలెక్టర్  కె. సీతారామారావు, సివిల్  సప్లై ఆఫీసర్​ స్వామి కుమార్, డీఎం బాల్​రాజ్  పాల్గొన్నారు.