దళారుల చేతిలో.. పల్లి రైతు విలవిల!

దళారుల చేతిలో.. పల్లి రైతు విలవిల!
  • క్వింటాల్​పై రెండు రోజుల్లో రూ.2 వేలకు పైగా తగ్గింపు
  • అగ్రి మార్కెట్లకు పోటెత్తుతున్న వేరుశనగ
  • ఇదే అదనుగా సిండికేట్​ అవుతున్న  ట్రేడర్లు, కమిషన్​ ఏజెంట్లు
  • అడ్డికి పావుశేరు అమ్ముకొని మునుగుతున్న అన్నదాతలు

మహబూబ్​నగర్, వెలుగు ​: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పల్లి రైతును ట్రేడర్లు, కమిషన్​ఏజెంట్లు నిలువునా ముంచుతున్నారు. సోమవారం క్వింటాల్​పల్లికి రూ.8,700, మంగళవారం 8వేలు పెట్టారు. రేటు బాగానే ఉందని బుధవారం నుంచి మార్కెట్లకు పల్లి దిగుబడులతో రైతులు పోటెత్తగా వారిని మోసం చేస్తున్నారు. ట్రేడర్లు, కమిషన్​ ఏజెంట్లు ఒక్కటై రేటును అమాంతం తగ్గించారు. గురువారం బోర్డుపై అత్యధికం రూ.7,300, అత్యల్పం రూ.2,709  అని రాసి, రూ.5వేలకు మించి పెట్టలేదు. పైగా క్వాలిటీ లేదనే సాకుతో రూ.3వేల కంటే తక్కువకూ కొన్నారు. మార్కెట్లకు శుక్రవారం సెలవు కావడంతో తెచ్చిన దిగుబడులు వెనక్కి తీసుకెళ్లలేక రైతులు అడ్డికి పావుశేరు అమ్ముకున్నారు. మొత్తం మీద దళారుల దోపిడీతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పల్లి రైతు దగా పడ్డాడు.

రెండు రోజుల వ్యవధిలో రూ.2వేలు డౌన్​..

పాలమూరు జిల్లాలో పల్లి పంటకు సీజన్​కావడంతో మహబూబ్​నగర్, బాదేపల్లి అగ్రికల్చర్​మార్కెట్లు వేరుశనగ రాశులతో నిండిపోయాయి. మహబూబ్​నగర్ మండలంతో పాటు జడ్చర్ల, నవాబ్​పేట, బాలానగర్, మిడ్జిల్, దేవరకద్ర, కోయిల్​కొండ, హన్వాడ, నారాయణపేట, మక్తల్, దామరదిగ్గ, మాగనూరు, నర్వ, చిన్నచింతకుంట, కర్ణాటక రాష్ర్టంలోని యాద్గిర్​, సేడం ప్రాంతాల నుంచి రైతులు పంటను పెద్ద మొత్తంలో తీసుకొస్తున్నారు. దాదాపు 20 రోజుల పాటు పంట మార్కెట్​కు వచ్చే అవకాశం ఉండడంతో ట్రేడర్లు, కమిషన్​ ఏజెంట్లు సిండికేట్​అయ్యారు. రెండు రోజుల్లోనే క్వింటాల్​పై రూ.2 వేల నుంచి రూ.2,500 తగ్గించారు. ప్రభుత్వం వేరుశనగకు రూ.6,377  ఎంఎస్​పీ నిర్ణయించగా,  సోమ, మంగళవారం వరకు క్వింటాల్​పల్లిని వ్యాపారులు రూ.8,300 నుంచి రూ.8,700 వరకు పెట్టి  కొన్నారు. బుధవారం దిగుబడులు పెరగడంతో రేట్లను ఒక్కసారిగా తగ్గించేశారు. ప్రారంభంలో కొద్దిమందికి మాత్రం రూ.6 వేల నుంచి రూ.7వేల మధ్య చెల్లించి, క్వాలిటీ లేదని సాకుతో మెజారిటీ రైతుల వద్ద రూ.4500 నుంచి రూ.5,800కే కొన్నారు. గురువారం మరింత తగ్గించి రూ.3వేల లోపు కూడా కొన్నారు.  మహబూబ్​నగర్​వ్యవసాయ మార్కెట్​లో అత్యధిక ధర క్వింటాల్​కు రూ.7,300, అత్యల్పంగా రూ.2,709 నిర్ణయించినట్లు మార్కెట్​యార్డు బోర్డుపై రాసి పెట్టినా, గరిష్ఠ ధరలు ఎక్కడా అమలు కాలేదు. శుక్రవారం రిపబ్లిక్​డే కావడంతో మార్కెట్​కు సెలవు ప్రకటించారు. ఇదే అదనుగా వ్యాపారులు మరింత అగ్గువకు అడిగారు. పంటను వెనక్కి తీసుకెళ్లే వీలులేక  ట్రేడర్లు నిర్ణయించిన రేటుకే అమ్ముకున్న రైతులు నిరాశగా వెనుదిరిగారు.

ఏటా ఇదే తంతు..

ట్రేడర్లు, కమిషన్​ ఏజెంట్లు ఏటా రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. సంక్రాంతి పండుగకు ముందు  వచ్చే కొంత మొత్తం పల్లికి ఎంఎస్​పీ కంటే అధికంగా చెల్లిస్తున్నారు. పండుగ తర్వాత వచ్చే పంటకు రేట్​డౌన్​ చేస్తున్నారు. ఎంఎస్​పీ కంటే తక్కువ ధర ఇస్తున్నారు. అదీగాక కొనుగోళ్ల సమయంలో ట్రేడర్లు స్థానిక మార్కెట్​యార్డుల్లో ఉండే కమిషన్​ ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఉదయం మార్కెట్​కు రైతులు పల్లినీ తీసుకురాగానే, ఏజెంట్లు ముందుగా గింజను పరిశీలించి ట్రేడర్లకు సమాచారమిస్తున్నారు. తర్వాత ట్రేడర్లు ఫలానా బొడ్డెకు (వేరుశనగ కుప్ప) ఇంత రేట్​అని ఫిక్స్​ చేస్తున్నారు. సాయంత్రం మూడు గంటల తర్వాత ఆ పంటను కొంటున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మార్కెట్ల వద్ద వేచి చూస్తున్న రైతులు రోజంతా గడవడంతో తెచ్చిన పంటను తిరిగి తీసుకెళ్లలేక ట్రేడర్లు చెప్పిన రేట్​కే అమ్ముకుని పోతున్నారు.

ఖర్చులన్నీ రైతులవే..

అన్ని రకాలుగా మోసపోతున్న పల్లి రైతులకు ఏమీ మిగలడం లేదు. మార్కెట్​కు పంట తీసుకొస్తే అన్ని ఖర్చులు వారే భరించాలి. ఖర్చులకే దాదాపు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అవుతుండటంతో కూలీ కూడా పడటం లేదు. పంటను ట్రాక్టర్లు, డీసీఎంలలో మార్కెట్లకు తీసుకురావడానికి రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు కిరాయి చెల్లిస్తున్నారు. హమాలీలు, చాట కూలీలకు కలిపి రూ.2 వేల వరకు ఇస్తున్నారు. వేరుశనగను కుప్పలుగా పోసినందుకు ఆ స్థానానికి అద్దె కింద కుప్పకు రూ.250 నుంచి రూ.300 వరకు కడుతున్నారు. కాంటా జోకేటోళ్లకు సంచికి రూ.5, ట్రేడర్ల నుంచి గోనె సంచులను తీసుకున్నందుకు ఒకదానికి అద్దె కింద రూ.6 కడుతున్నారు. ఇవి కాకుండా కమిషన్​ ఏజెంట్​కు నూటికి రూ.5 చెల్లిస్తున్నారు. పంట కోసం పెట్టిన పెట్టుబడులు పోను రైతులకు మిగిలేదేమీ లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపలే కుమిలిపోతున్నారు.  

పెట్టుబడులు కూడా ఎల్లేటట్టు లేవు
 
మూడు ఎకరాల్లో పల్లి వేసిన. రెండు రోజులుగా పంటను మార్కెట్​కు తీసుకొస్తున్నాం. సరైన రేట్​వస్తలేదు. బండ్లకు కిరాయి పెరిగిపోతోంది. రేట్​చాలా తగ్గించారు. ఇప్పుడున్న రేటుకు పంటను అమ్ముకుంటే మాకు పెట్టుబడి కూడా ఎల్లేటట్లు లేదు.
- శంకర్​​, రైతు, గుర్మిట్కల్​, కర్ణాటక

క్వింటాల్​కు రూ.8,500 ఇస్తేనే లాభం

నాలుగు ఎకరాల్లో పల్లి పంటను సాగు చేశా. అడవి పందుల బెడద ఎక్కువగా ఉండడంతో బాగా లాస్​ వచ్చింది. ఎకరాకు 30 సంచులు రావాల్సి ఉండగా, కేవలం 20 బస్తాలు మాత్రమే వచ్చాయి. వచ్చిన పంటను మార్కెట్​లో అమ్ముకుందామంటే సరైన ధర లేదు. క్వింటాల్​కు రూ.7 వేలు ఇస్తే మాకు కూలీ కూడా గిట్టుబాటు కాదు. రూ.8,500 చెల్లిస్తేనే కొంత లాభం ఉంటుంది.  
- కిషన్​నాయక్, రైతు, గొండ్యాల్, హన్వాడ మండలం​