
- పసుపుమయమైన ఆలయ పరిసరాలు
- ఐదు క్వింటాళ్ల సమిధలతో అగ్నిగుండాలు
- పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
కొమురవెల్లి, వెలుగు : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో పట్నంవారం సందర్భంగా సోమవారం స్వామివారికి 21 వరుసల పెద్దపట్నం వేసి, అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన పలువురు యాదవ కుటుంబీకులు తోటబావి దగ్గర మల్లన్నకు పెద్దపట్నం వేసి ఐదు క్వింటాళ్ల సమిధలతో అగ్నిగుండాలు తయారు చేశారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి ఆలయ గర్భగుడిలోని ఉత్సవ విగ్రహాలను అగ్నిగుండాల వద్దకు చేర్చి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అర్చకులు పెద్దపట్నం, అగ్నిగుండాలు దాటగా.. అనంతరం శివసత్తులు, భక్తులు పెద్దపట్నం తొక్కుతూ అగ్నిగుండాలు దాటుకుంటూ వెళ్లి మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు.
అగ్ని గుండాల కార్యక్రమం సందర్భంగా భక్తులు గుంపుగా రావడంతో పోలీసులు నిలువరించలేకపోయారు. దీంతో పలువురు కిందపడి గాయాలపాలయ్యారు. హైదరాబాద్కు చెందిన మంజుల తలకు గాయమై రెండు కుట్లు పడ్డాయి. అలాగే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన లక్ష్మి, మాధవి ఊపిరాడక స్పృహ కోల్పోయారు. ఇబ్రహీంపట్నంకు చెందిన కనకరాజు కాలు విగిరింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.