కాకా కల నెరవేరిస్తే కరువు వచ్చేది కాదు : పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

కాకా కల నెరవేరిస్తే కరువు వచ్చేది కాదు : పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
  • దమ్ముంటే కాళేశ్వరం బ్యారేజీల కింద నిలబడి పంపులు ఆన్​ చేయండి
  • కేటీఆర్ కు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సవాల్ 
  • ధర్మపురిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

కరీంనగర్/ధర్మపురి, వెలుగు: దివంగత నేత కాకా తలపెట్టిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మించి ఉంటే కరువు వచ్చేది కాదని  పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సరిగ్గానే కట్టామనే నమ్మకం ఉంటే ప్రాజెక్టు కింది నిలబడి పంపులు ఆన్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుసవాల్ విసిరారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే బ్యారేజీలో నీటిని నిల్వ చేయడం లేదని, ప్రజల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యమని అన్నారు.

మరమ్మతులు పూర్తయ్యే వరకు బ్యారేజీని వినియోగించవద్దన్న సూచనలను పట్టించుకోకుండా పంపులు ఆన్ చేయాలని కోరడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. శుక్రవారం ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం, వెల్గటూరు, ఎండపల్లి మండలాల్లో పర్యటించిన ఎంపీ పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ ఇది కాలం తెచ్చింది కాదని, కేసీఆర్ తెచ్చిన కరువని విమర్శించారు.

లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం కుంగిపోయిందని,  రైతులకు చుక్క నీరు అందలేదని ఆరోపించారు. ధర్మపురి నియోజకవర్గానికి రూ.1.20 కోట్ల ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఏటీఎస్‌‌‌‌ల ద్వారా సుమారు 20 వేల మందికి శిక్షణ, ఉపాధి కల్పిస్తున్నట్టు తెలిపారు. టామ్‌‌‌‌కామ్ ద్వారా 10 వేల మందికి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా  కృషి చేస్తున్నామని చెప్పారు.

స్టార్టప్ ఐడియాలకు ఆర్థిక భరోసా

వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లె మోడల్ స్కూల్‌‌‌‌లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బెంచీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ విద్యనే ప్రాథమిక హక్కు అని దివంగత నేత కాకా వెంకటస్వామి చెప్పేవారని గుర్తు చేశారు. విద్యార్థులు స్టార్టప్‌‌‌‌లు, వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు. ఇందుకోసం 'కాకా గ్రోత్ ఫండ్' ఏర్పాటు చేశామన్నారు. నిరుపేద ఇన్నోవేషన్ క్రియేటర్ వెంకటేశ్ కు రూ.25 వేల సాయం అందిస్తానని ప్రకటించారు. పాఠశాల మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల కోసం రూ.10 లక్షలు మంజూరు చేశారు.

 స్కూల్​ గ్రౌండ్ ఏర్పాటుకు కలెక్టర్‌‌‌‌తో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎండపల్లి మండలం గుళ్లకోటలో గౌడ కులస్తుల సమస్యలు తెలుసుకున్నారు.  గౌడ సంఘం కమ్యూనిటీ భవన్ ప్రహరీ గోడ, ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఎంపీ లాడ్స్ నుంచి వెంటనే రూ.10 లక్షల నిధులను మంజూరు చేస్తూ ప్రోసిడింగ్​కాపీని  అందజేశారు.