రూ. 80 లక్షల కేటాయింపును రద్దు చేయండి
ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మున్సిపల్ కౌన్సిలర్లు
పెద్దపల్లి : స్థానిక ఎల్లమ్మ చెరువు గుండం కట్ట కోసం మున్సిపల్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ రూ.80 లక్షలు మళ్లించొద్దని జిల్లాకు చెందిన కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపల్ ఆమోదం పొందిన రూ.80 లక్షల నిధుల కేటాయింపులను చెరువు కట్టకు మళ్లిస్తున్నట్లు చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని కోరారు. కలెక్టర్ సూచనతోనే ఎల్లమ్మ చెరువుకు కేటాయింపులు జరిపామని మున్సిపల్ చైర్పర్సన్మమతారెడ్డి కౌన్సిల్ను తప్పుదోవ పట్టించారన్నారు. ఇదే ఎజెండాలో ఎల్లమ్మ గుండం చెరువుపై మరో రూ.34 లక్షలు కేటాయించి దినసరి కూలీలకు వెచ్చించడంపై, అవెన్యూ ప్లాంటేషన్ కింద నర్సరీలకు నీరు పోయడానికి ఐదు ట్యాంకర్ల కోసం రూ.13 లక్షల కేటాయింపులు జరపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసినవారిలో కౌన్సిలర్లు మల్లయ్య, సంపత్, సుభాష్ రావు, పుష్పకళ, స్వరూప కుమార్ తదితరులు
పాల్గొన్నారు.
బీఎంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు...
కార్పొరేషన్ లోన్ల విషయంలో ఇబ్బంది పెడుతున్న గర్రెపల్లి బ్యాంక్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలని ఎలిగేడు మండలం బుర్హాన్మియాపేటకు చెందిన లబ్ధిదారులు సోమవారం పెద్దపల్లి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన 14 మందికి ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి కన్సెంట్ లెటర్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. ఫిర్యాదు చేసినవారిలో గ్రామస్తులు చంద్రయ్య, రాజయ్య, లింగయ్య, నాగరాజు, కమల, శంకర్ఉన్నారు.
రాజన్న సిరిసిల్ల : స్థానిక కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 32 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరపాలన్నారు. కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ పవన్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
జగిత్యాల:ప్రజావాణికి వచ్చిన అర్జీలు, దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ జి.రవి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ ప్రజావాణికి 17 ఫిర్యాదులు, వినతులు వచ్చాయన్నారు. రెవెన్యూ, భూ సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు.