ఇద్దరు అటవీ ఉద్యోగులను డిస్మస్ చేసిన ఏపీ ప్రభుత్వం : ఇన్నాళ్లు ఎందుకు రహస్యంగా

ఇద్దరు అటవీ ఉద్యోగులను డిస్మస్ చేసిన ఏపీ ప్రభుత్వం : ఇన్నాళ్లు ఎందుకు రహస్యంగా

పీలేరు అటవీ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా అటవీశాఖ అధికారి సాయిబాబా ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఈ విషయాన్ని ఆ శాఖ అధికారులు గోప్యంగా ఉంచారు. 

పీలేరు కార్యాలయంలో పని చేస్తున్న తలపుల సెక్షన్ అధికారి శ్రీనివాసన్ అలియాస్ స్వామి, ఉస్తికాయల పెంట బీట్ అధికారి రెడ్డెప్ప, అసిస్టెంట్ బీట్ అధికారి విజయభాస్కర్, నూతన కాల్వ చెక్​ పోస్టు అధికారి జయబ్బ 2021లో ఎర్రచందనం అక్రమ రవాణాలో స్మగ్లర్లకు సహకరిస్తూ ఆధారాలతో అధికారులకు పట్టుబడ్డారు. అప్పట్లో సస్పెండ్ అయిన వీరు పలుకు బడిని ఉపయోగించి 2022లో విధుల్లో చేరగలిగారు.

ఇదే కేసుపై ప్రత్యేక పరిశోధన బృందంతో విచారణ జరిపించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్తూరు పర్యటనలో అటవీ శాఖ అధికారులతో సమీక్షించారు. అటవీశాఖలో ఇంటి దొంగల పని పట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ క్రమంలోనే ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడిన జయబ్బ మృతి చెందారు. 

ఫారెస్ట్ బీట్ అధికారి శ్రీనివాసన్ అలియాస్ స్వామి, ఏబీవో విజయ్ భాస్కర్ ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించినట్లు జిల్లా అధికారి జనవరి 3వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.ఈ విషయం బయటకు రాకుండా పీలేరు అటవీశాఖ అధికారులు గోప్యత పాటించారు.అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.