అసమతుల్యతను మోదీ అధిగమించాలి : పెంటపాటి పుల్లారావు

అసమతుల్యతను మోదీ అధిగమించాలి : పెంటపాటి పుల్లారావు

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నదనే వాదన చాలా కాలంగా ఉన్నదే. ఈ మధ్య దక్షిణ భారతదేశాన్ని కోరుతూ  గొంతు వినబడటం వెనకాల బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నమనే చెప్పాలి. ఆ డిమాండ్​లో సీరియస్​నెస్​ లేకపోయినా, విపక్షం అలాంటి  డిమాండ్​ను ఆసరాగా చేసుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు కదా. అలాగే మోదీ మంత్రివర్గంలోనూ దక్షిణాది ప్రాతినిధ్యం కూడా తక్కువగా ఉండటం ప్రతిపక్షాలకు విమర్శలు చేయడానికి సులభం అవుతున్నది. ఎన్నికలకు మూడు నెలలే ఉన్నా.. గత ఐదేండ్లుగా మంత్రివర్గంలో అసమానత విభజన వాదనలు చేసేవారికి అలుసుగా మారింది.

నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ,  దీనివల్ల నిధులు, ప్రాజెక్టుల కేటాయింపులు పక్షపాత ధోరణితో సవ్యంగా జరగకపోవడంపై ఇటీవల పలు రాష్ట్రాల్లో చాలా వివాదం నెలకొంది. అయితే వాస్తవానికి ఈ నిధుల కేటాయింపులో అసమానతపై చాలా ఏండ్లుగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.

మోదీ గత పది ఏండ్లుగా పాలిస్తున్నందున సహజంగానే ప్రతిపక్ష ప్రభుత్వాలు నిరసనలు తెలపడం సహజం. వసూలు చేసిన పన్నుల కేటాయింపు సాధారణంగా సెట్ ఫార్ములాపై జరుగుతున్నది. జీఎస్టీ పన్నులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందంపై విభజించబడ్డాయి. అదేవిధంగా, ఇతర పన్నుల భాగస్వామ్యం ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం జరుగుతున్నది. వాస్తవానికి, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, కొత్త సంస్థలలో పెద్ద ప్రాజెక్టులను నిర్ణయించే అంతిమ అధికారం మాత్రం కేంద్ర ప్రభుత్వానిదే.  తమకు అనుకూలమైన రాష్ట్రాలకు విదేశీ పెట్టుబడులను అందించడంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన పెద్ద పాత్ర పోషిస్తున్నది.

ఉదాహరణకు, కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని అంగీకరిస్తే తప్ప ఆపిల్ ఫోన్ కంపెనీ తమ పెట్టుబడులను ఆయా రాష్ట్రాల్లో లేదా కేంద్ర పాలితప్రాంతాల్లో పెట్టదు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ మొదలైన అంశాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకునే అనేక ఉమ్మడి విషయాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. అదేవిధంగా ఆదాయపు పన్నుతోపాటు ఇతర ఎక్సైజ్ పన్నులు విధించే పూర్తి అధికారాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి.

మౌలిక సదుపాయాల కోసం నిధులను కేటాయించే ఏకైక అధికారం

ఇటీవల గత కొన్ని ఏండ్లుగా రోడ్లు, వంతెనలు, రైల్వేలు, విమానాశ్రయాలు, పట్టణాభివృద్ధి, నగరాభివృద్ధి, మెట్రో రైళ్ల వంటి మౌలిక సదుపాయాల కోసం మోదీ ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇటువంటి కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం సహజంగానే బీజేపీ పాలిత రాష్ట్రాల వైపు మొగ్గు చూపింది. ముంబై-– బరోడా మధ్య బుల్లెట్ రైలు ఖరీదు 5 లక్షల కోట్ల రూపాయలు.  

ప్రధాని మోదీ గుజరాత్‌‌‌‌ రాష్ట్రానికి చెందినవారు కావడంతో  ఆయన తన సొంత రాష్ట్రానికి ఎంపిక చేశారనేది ప్రతిపక్షాల వాదన. గుజరాత్‌‌‌‌కు ఇతర రాష్ర్టాల కంటే అత్యధికంగా అసమానమైన రీతిలో నిధులు, ప్రాజెక్టుల కేటాయింపులు జరుగుతున్నాయి. కొత్త ఆసుపత్రులు, ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌లు, ఇతర సంస్థలు అధికార బీజేపీ పాలిత అనుకూల రాష్ట్రాలకు ఇబ్బడి ముబ్బడిగా ఒక్క రాష్ట్రానికే కేటాయించడం శోచనీయం. 

కేంద్ర కేబినెట్లో అసమానతే అతిపెద్ద సమస్య

అసమానత అనేది గ్రీకు-మూలం ఉన్న పదం, దీని అర్థం "అసమతుల్యత" . కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్ అసమతుల్యతతో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రా, తెలంగాణతోపాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం నామమాత్రంగా చాలా తక్కువగా  ఉంది,  మొత్తం 543 మంది ఎంపీల్లో ఈ రాష్ట్రాలకు 174 మంది ఎంపీలు ఉన్నారు.

కానీ, ఈ రాష్ట్రాలకు చెందిన చాలా తక్కువ మంది మంత్రులుగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులకు బలహీనమైన పోర్ట్‌‌‌‌ఫోలియోలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి పూర్తిస్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించే మంత్రి లేరనే చెప్పాలి. అయితే, వెంటనే బీజేపీ నేతలు  నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి తమిళనాడు వారని, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి  ప్రహ్లాద్ జోషి కర్ణాటకకు చెందిన వారని చెబుతారు. అయితే, వారు మంత్రిత్వశాఖలు కలిగి ఉండవచ్చు. కానీ, వారు ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేసే పెద్ద రాజకీయ నాయకులు కాదు.

అసమతుల్యత అలవాటు మానుకోవాలి

జాతీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ ప్రభుత్వం తన అసమతుల్యత అలవాటును మార్చుకోవాలి. దక్షిణాదిలో అపారమైన ప్రతిభ, మేధో సంపత్తి ఉంది.  కేంద్ర  కేబినెట్​లో  అసమానత ఆ పార్టీ బలహీనతగా మారి దక్షిణాది, బెంగాల్‌‌‌‌లో భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుంది. వాజ్‌‌‌‌పేయి కాలంలో డీఎంకే, తెలుగుదేశం, అసోం గణ పరిషత్, జార్ఖండ్ ముక్తి మోర్చా వంటి మిత్రపక్షాలకు చెందిన మంత్రులతోపాటు అన్ని రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర మంత్రివర్గంలో ఉండేవారు.
 

ఆ ప్రభుత్వంలో అసమానత తక్కువగా ఉండేది.  గత పదేండ్లుగా క్యాబినెట్​లో  సమానత్వాన్ని పాటించి ఉంటే, దక్షిణాదిలో కూడా బీజేపీ మరింత బలపడేది. దక్షిణ భారతదేశాన్ని కోరేవారి నోళ్లు మూతపడేవి.

కేబినెట్​లో ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం

గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌‌‌‌, జార్ఖండ్,  బిహార్‌‌‌‌,  పంజాబ్‌‌‌‌, ఢిల్లీ, రాజస్థాన్‌‌‌‌, హిమాచల్ ప్రదేశ్‌‌‌‌.మధ్యప్రదేశ్‌‌‌‌ రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య అధికంగా ఉండటం సహజమే అయినా, కీలకమైన శాఖలు కూడా ఆ రాష్ట్రాలకు చెందిన మంత్రుల వద్దనే ఉండటం గమనార్హం. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,  కేరళ,  కర్ణాటక రాష్ట్రాల్లో 172 మంది ఎంపీలు ఉన్నారు.  

అంటే దాదాపు 33%.  అయితే, ఈ రాష్ట్రాలకు చెందిన మంత్రుల్లో ఒక్క కీలకశాఖకు చెందిన మంత్రి కూడా లేరు. అనేక రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల్లో ఉన్న లోక్​సభ నియోజకవర్గాలు లేదా రాజకీయ సంఖ్యా బలం ఉన్న స్థాయిలో కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అసమానత కొనసాగుతున్నది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణతో పాటు కర్నాటక, కేరళ, బెంగాల్‌‌‌‌ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వంలో రాజకీయ బలం చాలా తక్కువగా ఉండడం అసమానతకు అద్దం పడుతోంది.

ఈ రాష్ట్రాల్లో ఎక్కువ మంది బీజేపీ ఎంపీలు లేకపోయినా, “అసమానత్వం” నివారించడానికి నాయకులను కనుగొని వారిని మంత్రివర్గంలో చేర్చుకోవడం ప్రభుత్వ విధి. వివిధ రాష్ట్రాల్లో రాజకీయ నేపథ్యం ఉన్నవారికి కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పిస్తారు. దీంతో ప్రభుత్వం పని చేసే విధానంలో న్యాయం ఉందని దేశవ్యాప్తంగా ప్రజలకు అనిపిస్తుంది. కాంగ్రెస్ హయాంలో గత కేంద్ర ప్రభుత్వాలను పరిశీలిస్తే రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు మంత్రివర్గంలో 16 మంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. గత పదేండ్లుగా మోదీ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. దక్షిణ బారతదేశం కోరడానికి అదో ప్రేరకం కాలేదందామా?

- డా. పెంటపాటి
పుల్లారావు,
పొలిటికల్​ ఎనలిస్ట్​