ఆగని దళిత బంధు ఆందోళనలు.. మెదక్ ​జిల్లాలో ధర్నాలు, నిరసన

ఆగని దళిత బంధు ఆందోళనలు..   మెదక్ ​జిల్లాలో ధర్నాలు, నిరసన
  •      మెదక్ ​జిల్లాలో పలుచోట్ల ధర్నాలు, నిరసన

మెదక్ వెలుగు : మెదక్​ జిల్లాలో ‘దళిత బంధు’ కోసం లబ్ధిదారుల ఆందోళనలు ఆగడం లేదు. అధికార పార్టీకి చెందిన కొందరికే ఇస్తున్నారంటూ  స్కీమ్​ అమలుపై దళితులు నిరసన తెలుపుతున్నారు. ధర్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో అర్హులందరికీ ఇవ్వాలి..  

Also Raed:-- వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది!

లేకుంటే మొత్తానికే రద్దు చేయాలంటూ పలు గ్రామాల్లో తీర్మానాలు సైతం చేస్తున్నారు. అర్హుల విషయమై ఎస్సీలు, బుడగ జంగాల మధ్య లొల్లి జరిగి ఇరువర్గాల వారు కలెక్టరేట్ ఎదుట నిరసన సైతం చేపట్టారు. 

ఎక్కడ.. ఏ పరిస్థితి? 

  • దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని అల్లాదుర్గం మండలం ముప్పారం, వెంకట్రావుపేట్ గ్రామస్తులు ఎంపీడీవో కు వినతి పత్రం అందజేయగా, మాందాపూర్ గ్రామంలో కొందరికే మంజూరు చేస్తే దళిత బంధు వద్దంటూ దళితులు ర్యాలీ నిర్వహించి, స్థానిక ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. గ్రామంలో  120 దళిత కుటుంబాలు ఉండగా కేవలం 8 మందికి మాత్రమే ఈ స్కీమ్ మంజూరు కావడంపై వారు నిరసన తెలిపారు. స్కీమ్ గురించి అందరికీ సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే సన్నిహితులుగా ఉన్న కొందరికే  మంజూరు చేశారని ఆరోపిస్తున్నారు. గ్రామంలో అర్హత గల దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని, లేదంటే పూర్తిగా రద్దు చేయాలని   గ్రామ పంచాయతీ  ఆధ్వర్యంలో తీర్మానం చేశారు.
  •  దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయంటూ అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామ దళితులు ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా చేశారు. గ్రామంలో మొత్తం 120 కుటుంబాలు ఉండగా, అందులో నలుగురికే దళిత బంధు ప్రకటించడం సరికాదన్నారు. అర్హులైన కుటుంబాలకు అందించకుండా,  ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ పేర్లు ప్రకటించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. లిస్ట్ లో కేవలం నలుగురి పేర్లు రావడంతో గ్రామంలో గొడవలు జరుగుతున్నాయి. 
  • దళిత బంధును బీఆర్ఎస్ లీడర్లకే ఇస్తు న్నారని ఆరోపిస్తూ రేగోడ్ మండల పరిధిలోని తిమ్మాపూర్ లో వార్డు మెంబర్లు, దళితులు ఆందోళనకు చేశారు. ఎంపీడీవో ఆఫీసు ముందు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
  • వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో దళిత బంధు పథకం కింద లబ్దిదారుల ఎంపిక కోసం నిర్వహించిన సభలో ఎస్సీలు, బుడగ జంగాల మధ్య కొట్లాట జరిగింది. అసలైన దళితులకు కాకుండా వలస వచ్చిన బుడగ జంగాలకు దళిత బంధు పథకం ఎలా అమలు చేస్తారంటూ ఎస్సీలు ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. మాటామాటా పెరిగి ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఎస్సీలు, బుడగ జంగాల వారు వేర్వేరుగా ఆందోళన చేశారు. బుడగ జంగాల వారిపై ఎస్సీలు  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఇరువర్గాల వారు కలెక్టరేట్ కు తరలివెళ్లారు. పోటా పోటీగా నిరసన తెలిపారు.
  •  శివ్వంపేట మండలం అల్లిపూర్ గ్రామ దళితులందరికీ దళితబంధు స్కీమ్ కింద ఆర్థిక సహాయం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ దళితులు  పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఊరిలో మొత్తం 70 దళిత కుటుంబాలు ఉన్నాయని, అందరికీ దళితబంధు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యేకు ఇప్పటికే చాలా సార్లు విజ్ఞప్తి చేశామని, కానీ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.