శివారు ప్రాంతాలను ఆర్టీసీ పట్టించుకోవట్లేదని జనం ఆగ్రహం

శివారు ప్రాంతాలను ఆర్టీసీ పట్టించుకోవట్లేదని జనం ఆగ్రహం
  • రద్దు చేసిన రూట్లలో బస్సులు నడపాలని రిక్వెస్టులు
  • రోడ్లపై ఆందోళనలకు దిగుతున్న స్టూడెంట్లు, రైతులు 
  • పాస్​లు ఉన్నా ఉపయోగపడట్లేదని అసహనం

హైదరాబాద్, వెలుగు: సిటీ శివారు ప్రాంతాలను ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నా బస్సుల సంఖ్య పెంచకపోవడం దారుణమని మండిపడుతున్నారు. కరోనా టైంలో రద్దు చేసిన అన్ని రూట్లలో బస్సులు తిప్పాలని డిమాండ్​చేస్తున్నారు. రైతుబజార్లు, ఇతర పనుల మీద రైతులు, కూలీలు, చిరు ఉద్యోగులు రోజూ సిటీకి వస్తారు. వీరితోపాటు స్కూళ్లు, కాలేజీల కోసం స్టూడెంట్లు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. సరిపడా బస్సులు లేక, కొన్ని రూట్లలో బస్సు సర్వీసులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీకి చేరుకునేందుకు ప్రైవేట్ వెహికల్స్​ను ఆశ్రయిస్తున్నారు.

ఇటీవల కొన్ని రూట్లలో బస్సులు నడపాలని డిమాండ్ ​చేస్తూ స్టూడెంట్లు, రైతులు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మెహిదీపట్నం నుంచి జన్ వాడకు బస్​ సర్వీస్ ​నిలిపివేయడంతో ప్రజాప్రతినిధులతో మెయిన్​రోడ్డుపై ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. ఇబ్రహీంపట్నంలోనూ స్టూడెంట్లు  నిరసన తెలిపారు. ఇలా తరచూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. డిపో మేనేజర్లకు రిక్వెస్ట్ ​లెటర్లు ఇస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఇబ్బందులను తెలుపుతున్నారు. ఫొటోలను షేర్​చేస్తూ మండిపడుతున్నారు.

300 రూట్లలో బస్సుల్లేవ్​

గ్రేటర్​పరిధిలో 29 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. 2019 ఆర్టీసీ సమ్మెకు ముందు వీటి పరిధిలో 3,700 బస్సులు నడిచేవి. తర్వాత లాభాలు రావడం లేదని, స్క్రాప్ పేరుతో వెయ్యి బస్సులు రద్దు చేశారు. కరోనా టైంలో నడవక తీవ్ర నష్టాలు వచ్చాయని ఒక్కో డిపో నుంచి15 నుంచి 30 బస్సులు తగ్గించారు. ఆ ప్రభావం శివారు ప్రాంతాలపై పడింది. కొద్ది రోజులుగా మొత్తం 2,800 బస్సులు తిప్పుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. ‘230 ఎన్’ బస్సు సికింద్రాబాద్ నుంచి నాగులూరు, దుండిగల్, ‘230’  సికింద్రాబాద్ నుంచి  దుండిగల్ తండా, ‘230’  సికింద్రాబాద్ నుంచి బౌరంపేట, 445 నంబర్ బస్సు మెహిదీపట్నం నుంచి కేతిరెడ్డిపల్లి వెళ్లే నైట్ఆల్ట్, ‘284’ కోఠి నుంచి కాచబోయిన సింగారం, ప్రతాపసింగారం, 115 మేడిపల్లి నుంచి పర్వతాపురం, 220జే ఇలా గ్రేటర్​లో 300కుపైగా రూట్లలో ఇంకా బస్సులు తిరగడం లేదు. రోజూ గ్రేటర్​వ్యాప్తంగా 11 లక్షల మందికి పైగా సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా వీరిలో శివారు ప్రాంతాల నుంచే వచ్చేవారు ఎక్కువగానే ఉంటున్నారు. 

రైతులు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు

కూరగాయలు, పాల వ్యాపారులు, చిరుద్యోగులు సిటీకి వచ్చి వెళ్లేందుకు గతంలో అన్ని రూట్లలో సిటీ బస్సులు తిరిగేవి. చాలా గ్రామాలకు నైట్ ఆల్ట్​బస్సులు ఉండేవి. ఇప్పుడు అవేం లేవు. చాలావరకు అంతా సొంత వెహికల్స్​లో వస్తున్నారు. లేనోళ్లు ప్రైవేట్​వెహికల్స్​ఎక్కుతున్నారు. దూరాన్ని బట్టి రోజూ రూ.1,500 నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. అంత ఖర్చు చేయలేనివారు సిటీ దాకా రావడం లేదు.

నైట్ ఆల్ట్ ఉంటే బాగుంటుంది

మొయినాబాద్ పరిధి కేతిరెడ్డిపల్లి గ్రామానికి గతంలో ప్రతిరోజూ రాత్రి మెహిదీపట్నం నుంచి 445 నంబర్ బస్సు వచ్చేది. కరోనా తర్వాత నుంచి రావడం లేదు. ఈ బస్సును తిరిగి స్టార్ట్ చేస్తే చాలా గ్రామాల వారికి మేలు జరుగుతుంది. స్టూడెంట్లతోపాటు పాలు, కూరగాయలు అమ్మే రైతులకు 
వీలుగా ఉంటుంది.

-  దారెడ్డి కృష్ణారెడ్డి, సర్దార్ నగర్  మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్

స్టూడెంట్లకు ఇబ్బంది

స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు గ్రామీణ స్టూడెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫుట్ బోర్డింగ్ ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఉదయం, సాయత్రం వేళల్లో బస్సుల సంఖ్యను పెంచాలి. మెహిదీపట్నం నుంచి మొయినాబాద్, చిల్కూరు, ఇబ్రాహీంపట్నం, హయత్ నగర్ ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా ఉంది. బస్సుల కోసం రోడ్డెక్కాల్సి వస్తోంది.

- కమల్, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ

విద్యాసంస్థల టైమింగ్ మార్చాలి

స్కూళ్లు, కాలేజీల టైమింగ్ మారిస్తే ఇబ్బందులు ఉండవు. ఈ విషయంపై పలుసార్లు చర్చలు జరిగాయి. ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో బస్సుల సంఖ్యను పెంచుతూనే ఉన్నాం. ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు,  మళ్లీ సాయంత్రం 4 నుంచి 6 గంటల టైమ్​లో బస్సులు తిప్పుతున్నాం. 

- యాదగిరి, ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ