నియోజకవర్గాల్లో ప్రజలను పీక్కుతింటున్నరు: షర్మిల

నియోజకవర్గాల్లో ప్రజలను పీక్కుతింటున్నరు: షర్మిల

స్కూటర్​పై తిరిగిన కేసీఆర్​కు విమానం కొనే డబ్బెక్కడిదని ప్రశ్న

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, రేగొండ, వెలుగు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కబ్జారాయుళ్లని, పలు నియోజకవర్గాల్లో ప్రజలను పీక్కుతింటున్నారని వైఎస్సార్​టీపీచీఫ్​ షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వ, పేదల భూములను కబ్జాలు చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. దళితబంధు అని చెప్పి అనుచరులబంధు చేశారని, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులకు తప్ప ఈ పథకం పేద దళితులకు ఉపయోగపడటం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌‌‌‌ను నమ్మి ఓట్లేస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని హెచ్చరించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామం నుంచి మొదలైంది. రేగొండ, రంగయ్యపల్లి, లింగాల, కొడవటంచ, మడతపల్లి మీదుగా యాత్ర సాగింది. మడతపల్లిలో మాటముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఒకప్పుడు డొక్కు స్కూటర్‌‌‌‌పై తిరిగిన కేసీఆర్‌‌‌‌.. ఇప్పుడు పెద్ద, పెద్ద గడీలు, ఫాంహౌస్‌‌లు కట్టుకున్నాడని, ఫ్లైట్లు, హెలికాఫ్టర్లు కొంటున్నాడని, ఇదంతా ప్రజల సొమ్మే అని షర్మిల ఆరోపించారు. 

కొలువులు ఖాళీగా ఉన్నా భర్తీ చేస్తలేదు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌లోనే రూ.70 వేల కోట్లను కేసీఆర్ కాజేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరి వాటా వాళ్లు తీసుకుని గమ్మునుంటున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి కేసీఆర్​ అరచేతిలో వైకుంఠం చూపించాడని, కేసీఅర్ కుటుంబానికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకే బంగారు తెలంగాణ అయ్యిందని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని, మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఎన్నికలు ఉంటేనే పథకాలు అమలు చేస్తున్నారని, కేసీఆర్‌‌‌‌ సర్కారుకు పేదలకు ఇండ్లు ఇచ్చే ఉద్దేశం లేదని, ఇది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే సర్కార్‌‌‌‌ కాదని ఆరోపించారు.