ఏసీలు మస్తు కొంటున్నరు..సిటీలో మండిపోతున్న ఎండలు 

ఏసీలు మస్తు కొంటున్నరు..సిటీలో మండిపోతున్న ఎండలు 
  • ఏసీలను ఎక్కువగా కొనుగోలు  చేసేందుకు జనాలు ఇంట్రెస్ట్  
  • సిటీలో రోజూ  పదివేలకు పైగా  అమ్మకాలు 
  • కొనుగోలుదారులతో రద్దీగా ఎలక్ట్రానిక్ స్టోర్స్​
  • భారీగా పెరిగిన విద్యుత్ వాడకం

హైదరాబాద్, వెలుగు : సమ్మర్ సీజన్ షురువైంది. సిటీలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నుంచే భానుడు  ప్రతాపం చూపుతున్నాడు. చెమట, ఉక్కపోత, ఎండ వేడిమి తట్టుకోలేక జనాలు చల్లదనంలో సేదతీరేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కూలర్లు, ఫ్యాన్లతో సరిపోకపోతుండగా ఏసీలను ఎక్కువగా కొనుగోలు చేస్తుండగా  ఫుల్​డిమాండ్​ఏర్పడింది. ఈ సమ్మర్​లో  అధికంగా  అమ్ముడుపోతుండగా ఎలక్ట్రానిక్స్ షోరూమ్ లు రద్దీగా కనిపిస్తున్నాయి. మధ్య తరగతి వర్గాల వారే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.   ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉండడంతో  ఏసీల అమ్మకాలు పెరుగుతున్నాయి.    

రోజుకు వేలల్లో  సేల్స్​..

సిటీలో  రోజుకు 10 వేలకుపైనే ఏసీలు అమ్ముడవుతున్నట్టు అంచనా.  మున్ముందు పెరగొచ్చు. ఇప్పటికే డెలివరీలకు 4,5 రోజుల టైమ్​పడుతుంది. ఫిట్టింగ్​కు మరో రెండు రోజులు అవుతుంది. ఎక్కువగా 5 స్టార్​రేటింగ్​ఏసీలు, 1.5 టన్స్​కొంటున్నారు. సాధారణంగా 1 నుంచి 5 స్టార్​వరకు రేటింగ్ ఉంటుంది. రేటింగ్ పెరిగే కొద్ది కరెంట్​వాడకం తగ్గుతుంది. ఇన్వర్టర్​ టెక్నాలజీ ఏసీలతోనూ విద్యుత్ వాడకం తగ్గుతుండగా వాటిని కూడా కొంటున్నారు. ఏసీలు బేసిక్​గా 30 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. స్టోర్స్ నిర్వాహకులు జీరో ఇంట్రెస్ట్​తో ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తుండగా  కొనేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. 

రికార్డ్​ స్థాయిలో కరెంట్ వాడకం 

పెరిగిపోతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా సిటీలో రికార్డు స్థాయిలో విద్యుత్ వాడకం నమోదవుతుంది. సమ్మర్ లో ప్రజలు బోర్ మోటార్లు, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో  కరెంట్​వినియోగం కూడా అధికంగానే ఉంటుంది. గతేడాది మేలో కరెంట్ వాడకం  రికార్డులను  పోల్చితే.. ఈఏడాది మార్చిలోనే దాటింది. 2023లో  మే 19న అధికంగా 79.33 మిలియన్ యూనిట్ల విద్యుత్ నమోదైతే.. గత మార్చి 28న 79.48 మిలియన్​యూనిట్ల వాడకంతో  పాత రికార్డ్ ను క్రాస్​చేసింది. మార్చి లో తొలి నుంచే కరెంట్​వాడకం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. మేలో ఎండల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుండగా  మరింతగా విద్యుత్​ఖర్చు పెరగనుంది.

పాప కోసం తీసుకున్నాం

ఈసారి ఎండలు ఎక్కువగాఉన్నాయి. ఏప్రిల్ లోనే ఇలా ఉంటే మే లో ఇంకా దారుణంగా ఉండొచ్చు.  ప్రస్తుతం కూలర్ వాడుతున్నం. కానీ అది సరిపోవట్లేదు. ఇటీవలే  మాకు పాప పుట్టింది. ఈ వేడిని తట్టుకోలేదు. అందుకే  ఏసీ కొనక తప్పట్లేదు. ఏసీల రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయినా ఈఎమ్ఐలో తీసుకున్నా. 

సందుపట్ల రవి కుమార్​, ప్రైవేట్ ఎంప్లాయ్,అమీర్ పేట్ 

ఈఎంఐలోనే ఎక్కువగా కొంటున్నరు 

గతేడాది కంటే ఈసారి సేల్స్​పెరిగాయి. రోజూ 100 ఏసీలకు పైనే అమ్ముతున్నాం. ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. దీంతో మధ్యతరగతి వర్గాల ప్రజలు ఏసీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.  

రవి, సీనియర్ ప్రమోటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, పంజాగుట్ట