ఓపెన్ ప్లాట్లు మస్తు కొంటున్నరు

ఓపెన్ ప్లాట్లు మస్తు కొంటున్నరు
  • ఓపెన్ ప్లాట్లు మస్తు కొంటున్నరు
  • రెండేండ్లలో భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు
  • గత ఏడాది 5.80 లక్షల ఓపెన్ ప్లాట్ల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్
  • ఇండ్లు, ఫ్లాట్ల కంటే ప్లాట్లపైనే పెట్టుబడి పెడుతున్న జనం
  • డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లపై రిజిస్ట్రేషన్ శాఖ రిపోర్ట్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఓపెన్ ప్లాట్లపై జనం ఎక్కువగా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. పట్టణ, మండల కేంద్రాలు, రోడ్ల పక్కన అగ్రికల్చర్ భూములను వెంచర్లుగా మారుస్తుండటంతో వాటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇండ్లు, ఫ్లాట్ల కంటే ఎక్కువగా ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గత రెండేండ్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల వివరాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతున్నది. 2021–22లో 5.50 లక్షల డాక్యుమెంట్లు ఓపెన్ ప్లాట్ల కింద రిజిస్టర్ అయ్యాయి. 2022–23లో ఇది 5.90 లక్షల డాక్యుమెంట్లకు పెరిగింది. ఫ్లాట్లు, ఇండ్లవిషయానికొస్తే ఓపెన్ ప్లాట్ల డాక్యుమెంట్ల కంటే 50 శాతం తక్కువే ఉన్నాయి. ఇటీవల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్​ డిపార్ట్‌‌మెంట్ కాంపరేటివ్ డేటా రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. సర్కారుకు వేటి ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందనేది వెల్లడించింది.

ప్లాట్లుగా మారుతున్న వందల ఎకరాలు

సాగు భూములను ప్లాట్లుగా మారుస్తుండటంతో ఓపెన్ ప్లాట్ల కొనుగోళ్లు, అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఉదాహరణకు ఒక ఎకరం సాగు భూమిని వెంచర్​గా మార్చి.. ప్లాటింగ్ చేస్తే 4 వేల గజాలపైనే వస్తుంది. దీంట్లో ఒక్కో ప్లాటును కనీసం 200 గజాలకు చేసినా.. 20 ప్లాట్లుగా చేయొచ్చు. ఈ లెక్కన 20 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్​ చేయాల్సి వస్తోంది. ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీలు వందల ఎకరాల్లో ప్లాట్లను విక్రయిస్తున్నాయి. ప్రధానంగా నేషనల్ హైవేస్, డబుల్, సింగిల్ లేన్ రోడ్లకు పక్కన ఉన్న భూములే టార్గెట్​గా వెంచర్లు వెలుస్తున్నాయి.

రెండు, మూడేండ్ల కిందటి వరకు జిల్లా కేంద్రాలకు, ప్రధాన పట్టణాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోనే ఓపెన్ ప్లాట్ల వ్యాపారం నడవగా.. ఇప్పుడు గ్రామాలకూ విస్తరించింది. అందుకే ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరుగుతున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం వివరాలను పరిశీలిస్తే.. ప్రతినెలా సగటున 40 వేల నుంచి 48 వేల డాక్యుమెంట్ల వరకు ఓపెన్ ప్లాట్లు రిజిస్టర్ అవుతున్నాయి.

రిజిస్ట్రేషన్ల శాఖకు గతేడాది రూ.14,250 కోట్లు

రాష్ట్ర సర్కార్‌‌‌‌కు ఆదాయం తెచ్చిపెట్టడంలో ఫ్లాట్లు ఫస్ట్ ప్లేస్‌‌లో ఉన్నాయి. తర్వాతి స్థానంలో ఓపెన్ ప్లాట్ల ఆదాయం ఉంటున్నది. థర్డ్ ప్లేస్​లో ఇండ్ల రిజిస్ట్రేషన్ల  డాక్యుమెంట్ల ఇన్​కం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు భూముల విలువలు సవరించి, రిజిస్ట్రేషన్​ చార్జీలు విపరీతంగా పెంచింది. దీంతో ఆదాయం కూడా భారీగా పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ధరణి ఇతరత్రా అన్నీ కలిపి  రూ.14,250 కోట్లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల  శాఖ ఆర్జించింది. ఇందులో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లతో  దాదాపు రూ.5,300 కోట్ల రాబడి వచ్చింది.

ఓపెన్ ప్లాట్లతో రూ.3,500 కోట్లు, ఇండ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లతో రూ.2,800 కోట్లు వచ్చింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలిస్తే.. 2021-22లో ఫ్లాట్లకు సంబంధించి 87 వేలు, గడిచిన ఆర్థిక సంవత్సరంలో 95 వేల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. ఓపెన్​ ప్లాట్ల విషయానికొస్తే గత ఏడాదిలో 5.80 లక్షల ఓపెన్​ ప్లాట్ల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్​ చేయగా.. అంతకుముందు ఏడాది 5.50 లక్షల డాక్యుమెంట్లు అయ్యాయి. ఇండ్ల రిజిస్ట్రేషన్లు చూస్తే 2021–22లో 1.07 లక్షల డాక్యుమెంట్లు కాగా.. ఈసారి అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు అయినట్లు ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్​లో రిజిస్ట్రేషన్ల శాఖ పేర్కొంది.

రేటు పెరుగుతదని..

ప్రైవేట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు, బిజినెస్ చేస్తున్నోళ్లు చాలామంది తమ సొమ్మును పెట్టుబడి కింద ఓపెన్ ప్లాట్ల మీదనే పెడుతున్నారు. రేట్లు పెరుగుతుండటం, అవసరం ఉన్నప్పుడు అమ్ముకుందాం అనే ఆలోచనతో ఎక్కువగా కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు వెంచర్లు వేస్తున్నోళ్లు కూడా ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పిస్తూ ప్లాట్లను అమ్ముతున్నారు. కొందరు రియల్​ వ్యాపారులు తాము కొనుగోలు చేసినప్పుడు ఉన్న రేటు కంటే కాస్త ఎక్కువ వచ్చినా మళ్లీ వెంటనే అమ్మేస్తున్నారు. యాదాద్రి భువనగిరి, వరంగల్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఎక్కువగా ఓపెన్​ ప్లాట్ల వ్యాపారం నడుస్తున్నది.