తాళాలు వేసిన ఇండ్లే టార్గెట్.. పాల్వంచలో వరుస చోరీలు

తాళాలు వేసిన ఇండ్లే టార్గెట్..  పాల్వంచలో వరుస చోరీలు

పాల్వంచ, వెలుగు : పాల్వంచ పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళకు గురవుతున్నారు. తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసి గత వారం రోజుల్లో సుమారు 25 లక్షల విలువ చేసే సొత్తును ఎత్తుకెళ్లారు.  కాంట్రాక్టర్స్ కాలనీలోని ఇప్పటికే నాలుగు ఇండ్లలో దొంగతనాలు జరిగాయి. కాంట్రాక్టర్ వెంకటరెడ్డి నివాసంలో సుమారు రూ.10 లక్షల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాల తో పాటు నగదు ఎత్తుకెళ్లారు. పి.ఉదయ్ కుమార్ అనే సింగరేణి ఉ ద్యోగి నివాసంలో రూ.5 లక్షల విలువచేసే ఆభరణాలు చోరీ చేశారు. బోర్ వెల్ వెంకటేశ్వరరావు నివాసంలో కిలో వెండి ఆభరణాలను, నాలుగున్నర లక్షల నగదు దొంగిలించారు. 

శనివారం వికాస తరంగిణి అధ్యక్షురాలు దేవినేని రోజా ఇంట్లో అరకిలో వెండి, విలువైన బంగారు ఆభరణాలతోపాటు నగదు ఎత్తుకెళ్లారు. వీటితోపాటు టీచర్స్ కాలనీ, అయ్యప్పనగర్ ప్రాంతాల్లో దొంగలు చోరీలు చేశారు. పాల్వంచలో డీఎస్పీ, సీఐ, ముగ్గురు ఎస్ఐలు సారథ్యంలో బందోబస్తు జరుగుతున్నా ఇంత  పెద్ద మొత్తంలో చోరీలు జరుగుతుండడంతో పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిఘా పెంచి దొంగతనాలను నివారించాలని కోరుతున్నారు.