- ఎఫ్‌డీల కంటే ఎక్కువ రిటర్న్ వస్తుండడమే కారణం
- లాంగ్ టెర్మ్‌కు బెస్ట్ ఆప్షన్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నవారు రోజు రోజుకి పెరుగుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 81 లక్షలకు పైగా కొత్త అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్‌పై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడం, ఇండస్ట్రీ వర్గాలు మార్కెటింగ్ పెంచడం, సెలబ్రిటీలతో యాడ్స్ ఇవ్వడం కలిసొస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు తమ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను పెంచి ప్రజలకు చేరువవుతున్నాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ) కంటే మ్యూచువల్ ఫండ్స్‌తో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ప్రజలు గుర్తించారని స్టాక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ట్రేడ్‌జీని సీఓఓ త్రివేష్ డీ అన్నారు. ప్రజల ఆదాయాలు పెరుగుతుండడం, ఫైనాన్షియల్ మార్కెట్స్ అందరికీ ఈజీగా అందుబాటులో ఉండడంతో ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారు పెరుగుతున్నారని అన్నారు.
మార్కెట్ పెరుగుతోందని, ముందుకెళ్లే కొద్ది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు మరింత పెరుగుతారని త్రివేష్ పేర్కొన్నారు. ఫండ్స్ రిస్క్ మేనేజ్‌మెంట్ విధానాలు బాగుండడం, ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతుండడం కలిసొస్తోందని అన్నారు. అంతేకాకుండా పొదుపు చేసేవాళ్లు తమ లాంగ్ టెర్మ్ గోల్స్‌ను చేరుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ వైపు చూడడం పెరిగిందని అన్నారు.
18.6 కోట్ల అకౌంట్లు..
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫి) డేటా ప్రకారం, మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్లు మే చివరి నాటికి 18.6 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఈ నెంబర్ 17.78 కోట్లుగా ఉంది. ఇది 4.6 శాతం గ్రోత్‌కు సమానం. మే నెలలో కొత్తగా 45 లక్షల అకౌంట్లు ఓపెన్ కాగా, ఏప్రిల్‌లో 36.11 లక్షల అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. కిందటేడాది ప్రతి నెల సగటున 22.3 లక్షల కొత్త మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి.
కాగా, ఒక ఇన్వెస్టర్‌కు మల్టీపుల్ అకౌంట్లు ఉండొచ్చు. మ్యూచువల్ ఫండ్ అకౌంట్లు ఓపెన్ చేసిన యునిక్ ఇన్వెస్టర్లు (యునిక్ పాన్ నెంబర్లు) ఈ ఏడాది మే చివరినాటికి 4.59 కోట్లుగా ఉన్నారు. మరోవైపు సిప్ రూట్‌లో ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నవారు పెరుగుతున్నారు. మొత్తం సిప్ అకౌంట్లు మే చివరి నాటికి 8.76 కోట్లకు చేరుకున్నాయి.
ఈక్విటీ ఫండ్స్‌కు గిరాకి..
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మెజార్టీ ఇన్వెస్టర్లు ఆన్‌లైన్ బాట పడుతున్నారు. జెన్ వై (1981–1996 మధ్య పుట్టినవారు), జెన్ జెడ్ (1997–2012 మధ్య పుట్టినవారు) ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ వైపు చూడడం పెరిగిందని యాంఫి పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పెరిగిన 81 లక్షల కొత్త అకౌంట్లలో 61.25 లక్షల అకౌంట్లు ఈక్విటీ ఫండ్ స్కీమ్‌ల కోసం ఓపెన్ అయ్యాయి. దీంతో ఈక్విటీ స్కీమ్స్ ఫండ్ అకౌంట్ల మొత్తం నెంబర్ 12.89 కోట్లకు పెరిగింది.
మొత్తం మ్యూచువల్ ఫండ్ అకౌంట్లలో ఇది 69 శాతానికి సమానం. షేర్ మార్కెట్ పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఎగబడుతున్నారు. ఓపెన్ ఎండెడ్ (ఎప్పుడైనా యూనిట్లను అమ్ముకునే వీలు) ఈక్విటీ ఫండ్స్ కేటగిరీలో సెక్టార్ల వైజ్‌గా ఉన్న ఫండ్ స్కీమ్‌లలో ఎక్కువ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. యాంఫి డేటా ప్రకారం, గత రెండు నెలల్లో ఇటువంటి స్కీమ్‌ల కోసం 23.19 లక్షల కొత్త అకౌంట్లు ఓపెన్ అయ్యాయి.
ఆ తర్వాత మిడ్ క్యాప్‌కు సంబంధించిన ఫండ్ స్కీమ్స్ కోసం 8.04 లక్షల అకౌంట్లు, స్మాల్ క్యాప్ స్కీమ్స్ కోసం 7.74 లక్షల అకౌంట్లు కొత్తగా ఓపెన్ అయ్యాయి. అలానే హైబ్రిడ్ ఫండ్స్ కోసం 3.31 లక్షల అకౌంట్లు ఓపెన్ కాగా, ఇందులో మల్టీ అసెట్ ఫండ్స్ స్కీమ్స్ కోసం 1.75 లక్షల కొత్త అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. మరోవైపు డెట్ ఫండ్స్ అకౌంట్లు 72,940 తగ్గి 70.92 లక్షలకు పడ్డాయి.